Why TMC was afraid of handing over Sheik Shahjahan to CBI?
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌ను
సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి పశ్చిమబెంగాల్ పోలీసులు
బుధవారం రోజంతా తాత్సారం చేసారు. ఆఖరికి, హైకోర్టు విధించిన గడువు సాయంత్రం 4.30
గంటలు దాటినా, అప్పగించలేదు. చివరికి సుమారు ఏడు గంటల ప్రాంతంలో షేక్ షాజహాన్‌ను సీబీఐకి అప్పగించారు.
బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో హిందూ
మహిళలపై టీఎంసీ కార్యాలయంలో సామూహిక అత్యాచారాలతో సంచలనం సృష్టించిన ఆ పార్టీ
నాయకుడు షేక్ షాజహాన్‌ను రక్షించుకోడానికి టీఎంసీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి
నిమిషం వరకూ ప్రయత్నిస్తూనే ఉంది. పేరుకి పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ, తమ గుప్పిట్లో
ఆడుతున్న పోలీసుల రక్షణలో ఉంచేందుకు శ్రమపడింది. షాజహాన్‌ను సీబీఐకి అప్పగించాలని
హైకోర్టు ఆదేశించినా, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది.
సుప్రీంకోర్టు ఇంకా విచారణ ప్రారంభించలేదన్న సాకుతో షాజహాన్‌ను సీబీఐకి
అప్పగించకుండా బుధవారం నాడు రోజంతా డ్రామాలాడింది. దాంతో బుధవారం నాడు రాష్ట్ర
హైకోర్టు మళ్ళీ, షాజహాన్‌ను సాయంత్రం 4.30లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ
చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బెంగాల్ సీఐడీ పోలీసులు షాజహాన్‌ను సీబీఐకి
అప్పగించారు.
ఈ నాటకం అంతా చూస్తే,
షేక్ షాజహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్ళకుండా ఆపడానికి రాష్ట్రంలో
అదికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ శ్రమపడుతోందని ఇట్టే అర్ధమవుతుంది. టీఎంసీ ఎందుకలా
భుజాలు తడుముకుంటోంది అని చూస్తే భారీ కుంభకోణాల్లో టీఎంసీ అగ్రనేతలకు షేక్
షాజహాన్ ఒక ముసుగులా ఉన్న సంగతి అర్ధమవుతుంది. అంతేకాకుండా, దోచుకున్న సొమ్ములు
కూడా అతని అధీనంలో ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ తనదైన శైలిలో
విచారిస్తే షాజహాన్ నోటివెంట ఎంత పెద్ద నేతల పేర్లు బైటపడతాయో అన్న భయం టీఎంసీని పీడిస్తోందా
అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.