మహాశివరాత్రి
సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక ఉత్సవాలు
నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకమండలి తెలిపింది. నేటి నుంచి ఈ నెల 13 వరకు ప్రతీరోజు త్రికాల అభిషేకాలు జరపనున్నారు.
మహాశివరాత్రి
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నేటి ఉదయం మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ
దుర్గామల్లేశ్వర స్వామి (ఉత్సవమూర్తులు) వార్లకు మంగళస్నానాలు ఆచరించి,
వధూవరులుగా
అలంకరించారు. సాయంత్రం వేళ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశస్థాపన,
అగ్ని ప్రతిష్ఠాపన, మండపారాధన, ధ్వజారోహణ, బలిపహారణ, హారతి, మంత్రపుష్పం, తీర్థ
ప్రసాద వినియోగం జరిగింది.
గురువారం
(మార్చి 7న) మండపారాధన, ఔపాసనలు, బలిపహరణ, మూలమంత్రం హవనం కార్యక్రమాలను
వేదోక్తంగా నిర్వహిస్తారు.
శుక్రవారం(మార్చి8న)
శ్రీమల్లేశ్వరస్వామికి త్రికాల అభిషేకాలు నిర్వహిస్తారు. రాత్రి9.30 గంటలకు
మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 12.30గంటలకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లకు
దివ్య లీలా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తులు రూ. 1,116 చెల్లించి కళ్యాణోత్సవంలో
పాల్గొనవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
మార్చి
9న కళ్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం 3గంటల 30 నిమిషాలకు రథోత్సవం జరుగుతుంది.
కనకదుర్గా నగర్ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా రథం సెంటరు వరకు ఊరేగింపు జరుగుతుందని
తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి
రాంబాబు , కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ పాల్గొన్నారు.