Sandeshkhali victims meet PM Modi
పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి
నరేంద్రమోదీని సందేశ్‌ఖాలీకి చెందిన ఐదుగురు బాధిత మహిళలు కలిసారు. నారీశక్తి
వందన్ అభినందన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం బరాసాత్ వెళ్ళిన ప్రధానిని కలిసి తమ గోడు
వెళ్ళబుచ్చుకున్నారు. తృణమూల్ పార్టీ నేత షేక్ షాజహాన్ నుంచి తమకు ఇంకా
బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రధానమంత్రి కార్యక్రమం జరిగిన బరాసాత్, ఉత్తర
24 పరగణాలు జిల్లాలో ఉంది. హిందూ మహిళలపై అత్యాచార ఘటనలతో వార్తల్లో నిలిచిన
సందేశ్‌ఖాలీ కూడా ఆ జిల్లాలోనే ఉంది. అక్కడి స్థానిక తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్‌పై
అధికారికంగానే 43 కేసులున్నాయి. భూముల ఆక్రమణ, అవినీతి అక్రమాల కేసులతో పాటు ఇటీవల
వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే షేక్ షాజహాన్, అతని అనుచరులు హిందూ అమ్మాయిలు,
మహిళలను ఎత్తుకుపోయి తృణమూల్ కార్యాలయంలో ఉంచి వారాల తరబడి సామూహిక అత్యాచారాలకు
పాల్పడేవారు.
ఇవాళ బరాసాత్లో ప్రధానమంత్రిని కలిసిన సందేశ్‌ఖాలీ
మహిళలు షేక్ షాజహాన్ అకృత్యాల గురించి ఆయనకు వివరించారు. పార్టీ అతన్ని
నామమాత్రంగా సస్పెండ్ చేసింది. అయినప్పటికీ షాజహాన్ మనుషులు తమను ఇంకా
బెదిరిస్తూనే ఉన్నారనీ, తమను భయపెడుతూనే ఉన్నారనీ వారు వాపోయారు.
ఆ బాధిత మహిళలు వెళ్ళబోసుకున్న గోడు, ఇంకా సందేశ్‌ఖాలీలో
కొనసాగుతున్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆ సమస్యను పరిష్కరించాల్సిన
తక్షణ అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, తమ పార్టీకే
చెందిన గూండాలు, రౌడీల మీద ఏ చర్యలైనా తీసుకుంటుందన్న నమ్మకం ఎవరికీ లేదు. అసలు
ఇవాళ్టి ప్రధానమంత్రి సమావేశానికి సందేశ్‌ఖాలీ నుంచి మహిళలు వెళ్ళకుండా భద్రతా
కారణాలన్న సాకు చెప్పి నిలువరించేసింది ఈ ప్రభుత్వం. ఎలాగోలా ఐదుగురు మహిళలు
మాత్రం చేరుకోగలిగారు. ప్రధానమంత్రికి స్వయంగా తమ బాధలు చెప్పుకోగలిగారు.
అంతకుముందు సందేశ్‌ఖాలీకి చెందిన కొందరు మహిళలు
ప్రధాని సభకు వెళ్ళడానికి ప్రయత్నించారు. ‘‘మా గౌరవం అంతా పోయింది. మేమెన్నో చిత్రహింసలు
అనుభవించాం. మోదీజీ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని ఒక మహిళ చెప్పింది.
‘‘ప్రధానమంత్రిని మేము కోరేది ఒకటే. మా ఓటు మేం
వేసుకోగలగాలి. అత్యాచారాలకు గురైన మాకు న్యాయం జరగాలి. మేం శాంతియుతంగా జీవించాలి.
అంతే’’ అని మరో మహిళ చెప్పింది.
బరాసాత్లో బహిరంగసభలో
మాట్లాడిన మోదీ, సందేశ్‌ఖాలీ మహిళలు ఎదుర్కొన్న అత్యాచారాల పట్ల ఆవేదన వ్యక్తంచేసారు.
‘‘తృణమూల్ నాయకత్వంలో ఈ గడ్డకు చెందిన ఆడబిడ్డలు చిత్రహింసల పాలయ్యారు. సందేశ్‌ఖాలీలో
జరిగిన సంఘటనలు ఎవరికైనా సిగ్గుచేటే. కానీ టీఎంసీ ప్రభుత్వానికి మీ సమస్యలు
తీర్చాలన్న ఆలోచనే లేదు. ఆ దోషిని ఎలా రక్షించాలి అనే ఆలోచిస్తోంది. వారి చర్యలను
హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టాయి. తృణమూల్ నాయకులు పేద, దళిత, గిరిజన
వర్గాలకు చెందిన మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం
బాధిత మహిళలను కాకుండా నేరస్తులైన తమ నాయకులనే నమ్ముతోంది’’ అంటూ ప్రధానమంత్రి
మండిపడ్డారు.