వెలిగొండ
ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిందని బీజేపీ
ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో
మాట్లాడిన దినకర్, సీఎం జగన్ పశ్చిమ ప్రకాశం ప్రజలను వెలిగొండ ప్రాజెక్టు పేరుతో
మోసం చేశారని ఆరోపించారు.
ఈ ఏడాది
జనవరి 30 నుంచి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని బీజేపీ ఆందోళనలు చేపట్టిందని
గుర్తు చేశారు.
పనుల్లో జాప్యం, నిర్వాసితుల
సమస్యలపై బీజేపీ లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రాజెక్టు
పూర్తి చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో మార్కాపురం, ఎర్రగుండపాలెంలో
ధర్నాలు చేపట్టామని వివరించారు. వెలిగొండకు బీజేపీ నిజానిర్ధారణ కమిటీ వెళ్ళి
నిర్మాణాలు పరిశీలిస్తుందన్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందా లేదా
అని స్పష్టం చేయాలని ప్రశ్నించిన దినకర్, నిబంధనలకు లోబడి ప్రాజెక్టు రివిట్మెంట్ నిర్మాణంపై
స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
కొల్లం
వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులు 60
శాతం పనులు పూర్తీ కాకుండా వెలిగొండ ను ఎలా జాతికి అంకితం చేస్తారని ప్రశ్నించారు.
డిస్ట్రిబ్యూటరీ
కెనాల్, ప్రాజెక్టులో భాగమైన వంతెనలు పూర్తి
చేశామని చెప్పే దమ్ము ఉందా అన్నారు. మిగులు
జలాల పైన ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి
ప్రస్తుత పరిస్థితులలో నీటిని మళ్ళించే
అవకాశం ఏ మేరకు ఉందో వివరించాలన్నారు.
ప్రాజెక్టుకు
సంబంధించి సందేహాలు నివృత్తి చేయకుండా ఎందుకు హడావుడిగా ప్రారంభం చేశారని
ప్రశ్నించారు.
గుండ్లకమ్మ పైన గేట్లు కొట్టుకు పోతే ఏడాదిగా కనీసం మరమ్మతు చేయని
జగన్ ప్రభుత్వం, వెలిగొండ పూర్తి చేశామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
వెలిగొండ
ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా జరగాలని బీజేపీ పోరాడుతుందన్నారు. కనిగిరి నిమ్జ్
మరియు దొనకొండ పారిశ్రామికవాడకు కేంద్రం నుంచి అనుమతులున్నా, అవసరమైన భూమి అందించని రాష్ట్ర ప్రభుత్వం
పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని చెప్పి ఎవరిని మోసం
చేస్తున్నారని ప్రశ్నించారు.
అమరావతి
నుంచి అనంతపురం వరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం కేంద్రప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు
చేస్తే, వైసీపీ ప్రభుత్వం రూట్ మార్చి ప్రకాశం ప్రజలకు అన్యాయం చేసిందన్నారు.
దర్శిలో
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కోసం కేంద్రప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్
ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు వెనక్కి పోయిందన్నారు.
పశ్చిమ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం అనుమతి ఇవ్వడంతో పాటు, దోర్నాలలో గిరిజనుల కోసం మల్టీ సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం సాయం పడుతోందన్నారు.