మూడు రాజధానుల పై మరోసారి సీఎం జగన్ కీలక
వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ
గెలుపు ఖాయమని జోస్యం చెప్పిన జగన్, సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా సాగరనగరమైన
విశాఖలోనే చేస్తానని ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత పలు సార్లు విశాఖ నుంచి
పాలన అంటూ ప్రకటించిన జగన్, రేపు, మాపు అంటూ ఇంతకాలం బండిని లాక్కొచ్చారు.
విశాఖకు
పాలనకేంద్రం మార్పు పై మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచే పాలన అంటూ
పలుసార్లు మీడియా ముఖంగా, బహిరంగ సభల వేదికగా జగన్ ప్రకటించారు. కానీ అడుగు
ముందుకు పడలేదు.
అయితే
ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ ఆఫీస్ ను రుషికొండకు మార్చుకుంటారని,
కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాల్లోనే నివాసం ఉంటారని తాజాగా చర్చ జరుగుతోంది.
నేడు విశాఖలో పర్యటించిన సీఎం జగన్, ఏపీ డెవలప్మెంట్
సదస్సులో పాల్గొన్నారు. అగ్ర పారిశ్రామికవేత్తలంతా
వైజాగ్ ను తమ నెక్ట్స్ ఫిన్ టెక్ కేపిటల్ గా చూస్తున్నారన్నారు.
అమరావతి
శాసన రాజధానిగా కొనసాగుతుందన్న సీఎం జగన్ ను వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా
మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషించారు. అమరావతిలో 50 వేల ఎకరాల బీడు భూమి
మినహా ఏమీ లేదన్న జగన్, అక్కడ అభివృద్ధికి ఎకరాకు రూ.2 కోట్లు చొప్పును లక్ష
కోట్లు అవసరం అన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణస్వీకారం
చేస్తానని చెప్పడంతో ఇప్పట్లో అయితే సీఎం అక్కడ నివాసం ఉండట్లేదని స్పష్టమైంది. నాలుగేళ్ళుగా
చెప్పిన మాటనే జగన్ మళ్ళీ పదాలు మార్చి చెప్పారు.
సీఎం
జగన్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతిలో సెక్రటేరియట్ ను తాకట్టు
పెట్టిన జగన్, విశాఖ వెళ్ళి ఏం చేస్తారని ప్రశ్నించాయి. రాజధాని పేరిట
ఉత్తరాంధ్రలో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నాయి. వైసీపీ విధ్వంసం
సృష్టించేందుకు విశాఖలో ఏం మిగిలిందని ప్రశ్నించాయి.