నిషేధిత మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయంటూ అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఊరట లభించింది. ముంబై హైకోర్టు పరిధిలోని నాగపూర్ బెంచ్ ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 నుంచి ఆయన్ను జైల్లో ఉంచారు. ఈ కేసులో సాయిబాబాకు గతంలో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తీర్పును హైకోర్టు బెంచ్ నిలిపేసింది.
సాయిబాబాపై మోపిన ఆరోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. అతనిపై ఉన్న అభియోగాలు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు అరెస్టైన మరో ఐదుగురికి కూడా ఊరట లభించింది. వారిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై స్టే ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.
కేసు పూర్వాపరాలు..
మావోయిస్టులతో సంబంధాల నేపథ్యంలో 2014లో ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టయ్యారు. ఆయనతోపాటు మరో ఐదుగురుని కూడా మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు అందరికీ జీవిత ఖైదు విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు.