ప్రముఖ
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని
దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి
ప్రాంతం మార్మోగుతోంది. శివమాలధారులు ఆదిదంపతులను దర్శించుకునేందుకు ప్రత్యేక
ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలు
నేటితో ఐదో రోజుకు చేరుకున్నాయి. కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం
తరఫున ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు స్వామి వారు రావణ వాహనంపై
నుంచి దర్శనమివ్వనున్నారు. రాత్రికి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో
నాలుగో రోజైన సోమవారం నాడు ఆదిదంపతులు మయూర వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైల దేవస్థానం వారు స్థలం కేటాయిస్తే, టీటీడీ తరఫున 200 గదుల భవనం నిర్మిస్తామని
ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీగిరిపై ఉన్న సత్రాన్ని ఆధునికీకరిస్తామన్నారు.