NIA raids at 17 places in 7 states in Prison
Radicalisation Case
బెంగళూరు జైల్లో ఖైదీలను ఉగ్రవాదులుగా మార్చిన
కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ఉదయం ఏడు రాష్ట్రాల్లోని
17 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఉగ్రవాద కుట్రలో ప్రమేయం
ఉన్నట్లు అనుమానిస్తున్న వారు నివసిస్తున్న ప్రదేశాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
బెంగళూరు జైల్లోని ఖైదీలను లష్కరే తయ్యబా ఉగ్రవాదులుగా,
ఆత్మాహుతి దళాలుగా మార్చారన్న విషయం ఈ యేడాది జనవరిలో వెలుగు చూసింది. దాంతో ఎన్ఐఏ
జనవరి 12న 8మంది వ్యక్తుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో జీవితఖైదు
అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఉండగా, జైల్లోనుంచి పారిపోయిన వారు ఇద్దరున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టి నసీర్
బెంగళూరు కేంద్రకారాగారంలో 2013 నుంచి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. జునైద్ అహ్మద్,
సల్మాన్‌ఖాన్ అనే మరో ఇద్దరు విదేశాలకు పారిపోయారు. వీరు ముగ్గురూ కాకుండా సయ్యద్
సుహైల్ ఖాన్, మొహమ్మద్ ఉమర్, జాహిద్ తబ్రేజ్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మొహమ్మద్
ఫైజల్ రబ్బానీ అనే మరో ఐదుగురు కూడా ఉన్నారు.
ఈ ఎనిమిది మంది నిందితుల మీద ఇండియన్ పీనల్ కోడ్,
ఉపా చట్టం, పేలుడు పదార్ధాల చట్టం, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద చార్జిషీట్
దాఖలు చేసారు.
ఈ కేసు మొదటగా 2023 జులై 18న బెంగళూరు సిటీ పోలీస్ రిజిస్టర్ చేసారు.
నిందితుల్లో ఒకరి ఇంట్లో వీరందరూ సమావేశమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ
ఇంటిపై దాడి చేసారు. అక్కడ ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్స్, వాకీటాకీలు పట్టుబడ్డాయి.
ఈ కేసును బెంగళూరు పోలీస్ నుంచి 2023 అక్టోబర్‌లో
ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. వారి దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూసాయి.
పలు పేలుడు కేసుల్లో ప్రమేయం ఉన్న టి నసీర్, బెంగళూరు జైల్లో ఉండగా 2017లో మిగతా వారిని
కలుసుకున్నాడు. వారిలో సల్మాన్ పోక్సో కేసులోనూ, మిగతావారు ఒక హత్యకేసులోనూ శిక్ష
అనుభవిస్తున్నారు.
నసీర్ జాగ్రత్తగా వారందరినీ తన బ్యారక్‌లోకి
మార్పించుకున్నాడు. వారిని ఉగ్రవాదులుగా మార్చడం, లష్కరే తయ్యబాలో రిక్రూట్
చేసుకోడం కోసం వారి సామర్థ్యాలను పరీక్షించాడు. మొదట అతను జునైద్, సల్మాన్‌లను
ఉగ్రవాదులుగా మార్చి వారిని ఎల్ఈటీలోకి రిక్రూట్ చేసాడు. తర్వాత జునైద్‌తో కలిసి మిగతా ఐదుగురినీ
రిక్రూట్ చేసుకోడానికి కుట్రపన్నాడు.
జునైద్ జైలు నుంచి విడుదలయ్యాక మరికొన్ని నేరాలకు
పాల్పడ్డాడు, పోలీసులకు దొరక్కుండా విదేశాలకు పారిపోయాడు. అక్కడినుంచీ అతను తన
సహనిందితులకు జైలు లోపలా, వెలుపలా లష్కరే తయ్యబా కార్యకలాపాలను ప్రచారం చేయడానికి
నిధులు పంపించడం ప్రారంభించాడు. అంతేకాదు, నసీర్‌ను పోలీస్ కస్టడీ నుంచి
తప్పించడానికి ప్రణాళిక రచించాడు. దాన్ని అమలు చేయడం కోసం వారికి తుపాకులు, మందుగుండు,
హ్యాండ్ గ్రెనేడ్స్, వాకీటాకీల వంటివి అందజేయడానికి సల్మాన్‌తో కలిసి కుట్ర చేసాడు.
అంతేకాదు, దాడి చేయడం కోసం పోలీసు దుస్తులు, టోపీలను దొంగతనంగా సంపాదించాలని, రిహార్సల్స్‌లో
భాగంగా ప్రభుత్వ బస్సులపై దాడులు చేయాలనీ సూచించాడు. ఐతే గత జులైలో ఆ ఆయుధాలు
పోలీసులకు దొరికిపోవడంతో కుట్ర భగ్నమైంది.
నాలుగు రోజుల క్రితం, అంటే మార్చి 1న
బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. ఆ
దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఈ కేసును వెలికితీసింది. అందులో భాగంగానే ఈ ఉదయం
17చోట్ల సోదాలు చేపట్టింది.