ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం జరిగిన దాడిలో పొలంలో పనిచేస్తోన్న భారతీయుడు మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన పట్నిటిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు.
లెబనాన్ నుంచి జరిపిన క్షిపణిదాడిలో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో పొలంలో పనిచేస్తోన్న వారు గాయపడ్డారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడిలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ ఉన్నారు. గాయపడిన వారు కూడా భారతీయులే కావడం గమనార్హం.
లెబనాన్ నుంచి హిజ్బొల్లా ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్ర ముఠా హమాస్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడికి దిగినప్పటి నుంచి హిజ్బొల్లా కూడా వారికి అనుకూలంగా దాడులకు దిగుతోంది.
గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, అప్పడప్పుడు లెబనాన్‌లో ఉగ్రశిబిరాలపై కూడా దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 229 మంది మరణించారని హిజ్బోల్లా ప్రకటించింది.