SC orders AAP to vacate its Head Quarters by 15 June
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ
పార్టీ తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో హైకోర్టుకు
చెందిన స్థలాన్ని ఆక్రమించి, అక్కడ అక్రమంగా కార్యాలయాన్ని నిర్మించుకోవడంపై ఉన్నత
న్యాయస్థానం మండిపడింది. ఆ భవనాన్ని ఖాళీ చేయడానికి జూన్ 15 వరకూ గడువు ఇచ్చింది.
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో
పెట్టుకుని సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు నాలుగు నెలల గడువు ఇచ్చింది.
ఈలోగా కేంద్రప్రభుత్వం అధీనంలో ఉండే లాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌కి,
ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ దరఖాస్తును నాలుగు
వారాల్లోగా ప్రోసెస్ చేసి తమ నిర్ణయాన్ని నాలుగు నెలల్లోగా వెల్లడించాలని ఆ
ఆఫీసుకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్,
న్యాయమూర్తులు జేబీ పర్దీవాలా, మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం…. ఆ స్థలంలో
కొనసాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి హక్కూ లేదని తేల్చిచెప్పింది.
ఢిల్లీ హైకోర్టు విస్తరణ కోసం కేటాయించిన భూమిని
ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్రమించిందని సుప్రీంకోర్టు ఫిబ్రవరి నెలలో గుర్తించింది. దేశవ్యాప్తంగా
న్యాయస్థానాల నిర్మాణాలకు సంబంధించిన ఒక కేసును విచారిస్తున్న సందర్భంలో ఈ విషయం
వెల్లడైంది.
ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి
సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఫిబ్రవరి 15న జరిగిన సమావేశంలో ఆప్ ప్రభుత్వం,
తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తే రెండు నెలల గడువులోగా ఖాళీ చేస్తామని హామీ
ఇఛ్చింది. అయితే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ ప్రారంభించలేదు. దాంతో సుప్రీంకోర్టు
న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ వ్యవహారంపై
స్పందిస్తూ చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని వ్యాఖ్యానించారు. ‘‘న్యాయవ్యవస్థకు
చెందిన స్థలాన్ని ఒక రాజకీయ పార్టీ ఎలా ఆక్రమించుకుంటుంది? ఆక్రమణలు అన్నింటినీ
తొలగించాల్సిందే. ఆ భూమిని హైకోర్టుకు అప్పగించాల్సిందే. ఆ స్థలం ప్రజలకు, పౌరులకు
న్యాయసేవలు అందించడానికి ఉద్దేశించినది’’ అని స్పష్టం చేసారు.
‘‘తదుపరి విచారణ తేదీలోగా ఢిల్లీ ప్రభుత్వపు ముఖ్యకార్యదర్శి,
పీడబ్ల్యూడీ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌తో
సమావేశమవ్వాలి, అన్ని సమస్యలనూ పరిష్కరించుకోవాలి’’ అని ఆదేశించారు.
అయితే, ఆప్‌కు ప్రత్యామ్నాయ స్థలం ఎందుకు ఇవ్వాలి
అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశ్నించారు. వాళ్ళు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటే
వారిని ఖాళీ చేయనివ్వండి. దానికి ప్రత్యామ్నాయ స్థలం ఎందుకు ఇవ్వాలి? అదేమి
షరతు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడం
తప్పు… అలాంటప్పుడు వారు సుప్రీంకోర్టును, హైకోర్టును ప్రత్యామ్నాయ స్థలం
గురించి ఎలా అడగగలరు?’’ అని నిలదీసారు.
ఆప్ తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్ మను
సింఘ్వీ, దేశంలోని ఆరు జాతీయ పార్టీల్లో ఒకటైన ఆప్‌కు తమ పార్టీ కార్యాలయం కోసం ఒక
స్థలాన్ని తీసుకునే హక్కుందని వాదించారు. దానికి ప్రధాన న్యాయమూర్తి సరదాగా స్పందించారు.
‘‘అసలు ఈ కేసులో మీరు వాదించనే కూడదు. ఢిల్లీ హైకోర్టుకు స్థలాన్ని మీరు
వ్యతిరేకించలేరు. మీ పరపతితో ఆప్‌కు స్థలం సంపాదించాలని భావిస్తున్నారు. దాన్ని
మేము ఎలా అనుమతించగలం?’’ అంటూ స్పందించారు.
గత విచారణలో, ఢిల్లీలో న్యాయవ్యవస్థకు మౌలిక
వసతుల కల్పనకు నిధులు సమకూర్చే విషయంలో ఢిల్లీ
ప్రభుత్వం ఉదాసీన వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మార్చి 2021 నాటికే
మూడు ప్రాజెక్టులకు అనుమతులు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకూ ఒక్క రూపాయి నిధులు కూడా
విడుదల చేయలేదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని
విమర్శించారు.