Supreme says MPs and MLAs have no exemption from bribery cases
భారతదేశపు పార్లమెంటు, లేదా
వివిధ రాష్ట్రాల శాసనసభల్లో సభ్యులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారికి విచారణలో
ఎలాంటి మినహాయింపూ ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు దేశ ఉన్నత
న్యాయస్థానం ఈ ఉదయం కీలకమైన తీర్పు వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు
మినహాయింపు ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. చట్టసభల్లో ప్రసంగాలు, ప్రశ్నలు, ఓట్లకు
లంచం తీసుకునే సభ్యులకు ఎలాంటి రక్షణా కల్పించబోమని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ
ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు 1998 నాటి
తీర్పును న్యాయస్థానం కొట్టేసింది.
2012 రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం సభ్యురాలు
సీతాసోరెన్ ఒకరి నుంచి లంచం తీసుకుని మరొకరికి ఓటు వేసారన్న ఆరోపణల మీద సీబీఐ
క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టేయాలని సీతాసోరెన్ మొదట జార్ఖండ్
హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ కేసును తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు
వెళ్ళారు.
ఆ కేసును 2019లో ముగ్గురు
సభ్యుల బెంచ్ విచారించి, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఆ బెంచ్, పీవీ నరసింహారావు కేసులో
తీర్పును మళ్ళీ పరిశీలించాలంటూ ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు
చేసింది. ఆ బెంచ్ ఈ కేసును సమగ్రంగా విచారించింది. ఈ ఉదయం ఆ కేసులో కీలక
తీర్పునిచ్చింది. పార్లమెంటరీ అధికారాలను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడేవారికి
న్యాయస్థానం రక్షణ కల్పించదని స్పష్టం చేసింది. 1998 తీర్పు రాజ్యాంగ అధికరణాలకు
విరుద్దంగా ఉందని తేల్చిచెప్పింది. లంచాలు తీసుకునే రాజకీయ నాయకుల విశ్వసనీయతపై తీవ్ర
ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.