లోక్‌సభ
ఎన్నికల సమయం దగ్గరపడటంతో బీజేపీ ప్రచార అంకంలో
ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా మారనున్నారు. వచ్చే పది రోజుల్లో సుడిగాలి పర్యటనలకు ప్రధాని
మోదీ సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో
29 అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా
షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణలోని
ఆదిలాబాద్‌లో మార్చి4న పర్యటించనున్న ప్రధాని మోదీ ఆ తర్వాత తమిళనాడు వెళతారు.
మరుసటిరోజు(మార్చి 5) తెలంగాణలోని సంగారెడ్డిలో పలు
ప్రాజెక్టులను ప్రారంభించి బహిరంగ సభ వేదికగా ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి
ఒడిశాకు పయనం అవుతారు. చండీఖోలేలో బహిరంగ
సభలో ప్రసంగించి మార్చి 6న కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రారంభిస్తారు.
బరాసత్
బహిరంగ సభ తర్వాత బిహార్ రాష్ట్రం బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మార్చి 7న జమ్మూకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం
తిరిగి దిల్లీకి చేరుకుంటారు.
మార్చి 8న సాయంత్రం అస్సాం వెళ్తారు. జోర్హాట్లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్
బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పీఎంవో పేర్కొంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్
కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించి ఇటానగర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి
అంకితమిస్తారు. అటు నుంచి పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో పలు అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభ వేదికగా ప్రజలను ఉద్దేశించి
ప్రసంగించనున్నారు.
మార్చి 10న అజంగఢ్‌లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారని అధికారులు
తెలిపారు. ఆ మరుసటి రోజు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్‌ను ప్రారంభిస్తారు.
మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి, రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లలో పలు
కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మార్చి 13న
గుజరాత్, అస్సాంలో సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు
వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.