తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా
హైదరాబాద్ ను మరో పదేళ్ళు కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్
దాఖలైంది.
ఎన్టీఆర్ జిల్లా
ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ ఈ
వ్యాజ్యాన్ని వేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల అధికారులను ప్రతివాదులుగా
పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2తో ముగుస్తుందని పిటిషన్ లో
ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014
మేరకు ఇరు
రాష్ట్రాల మధ్య నెలకొన్న కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఆస్తులు, అప్పులతో పాటు విభజన చట్టంలో
పేర్కొన్న 9వ షెడ్యూల్లో పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ
పూర్తికాలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు.
2034 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా
హైదరాబాద్‌ను కొనసాగించాలని విన్నవించారు. విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ
అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన వ్యవహారం వివాదాస్పదమైందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తన అధికారాల మేరకు వ్యవహరించడంలో
విఫలమైందన్నారు. విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం
దృష్టి సారించకపోవడంతో న్యాయస్థానాలు ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
ఉన్నప్పుడే ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కావాలన్నారు. విభజన చట్టంలోని
నిబంధనలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్
కు ఉందని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు.