విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. మహాబలిపురం వద్ద సముద్రంలో ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయి మరణించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.పలమనేరు ప్రభుత్వ కాలేజీలో బీ ఒకేషనల్ డిగ్రి ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు తమిళనాడులోని మహాబలిపురం యాత్రకు వెళ్లారు. బంగారుపాళ్యం మండలం కేసీ కండ్రిగ సమీపంలోని నలగాంపల్లెకు చెందిన విజయ్, మోషిష్, ప్రభు సముద్రపు అలల్లో చిక్కుకుని మరణించారు.
కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు కళాశాలకు సెలవులు ప్రకటించారు. దీంతో 18 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లారు. కళాశాల అధ్యాపకులు అధికారికంగా చేపట్టిన యాత్ర కాదని ప్రకటించారు. పేద కుటుంబాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మృతదేహాలను ఇంకా స్వగ్రామాలకు తరలించాల్సి ఉంది.