BJP releases first list of 195 candidates for forthcoming Lok Sabha elections
లోక్‌సభ ఎన్నికలకు 195మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. కొద్దివారాల్లో
జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ 195మంది అభ్యర్థుల తొలి జాబితాను
విడుదల చేసింది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ అయినా విడుదల కాకముందే, ప్రతిపక్షాలు
కూటమి కట్టడంలో లుకలుకలు పడుతూ ఉండగానే బీజేపీ మూడోవంతుకు పైగా స్థానాలకు తమ
అభ్యర్ధులను ప్రకటించి, ఎన్నికల రేసులో ముందంజలోకి వచ్చింది.
భారతీయ జనతా పార్టీ మొదటి జాబితాలో 34మంది కేంద్ర
మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులూ ఉన్నారు. ఈ 195మంది అభ్యర్థుల్లో 28మంది
మహిళలు. 27మంది ఎస్సీలు, 18మంది ఎస్టీలు, 57మంది ఓబీసీలు. ఇంక 47మంది అభ్యర్థుల
వయస్సు 50ఏళ్ళ కంటె తక్కువ. ఈ మొదటి జాబితాలో గరిష్ఠంగా 51 స్థానాలు ఉత్తరప్రదేశ్‌కు
కేటాయించారు. తెలంగాణకు 9 సీట్లు ప్రకటించారు.
బీజేపీ అగ్రనేత, దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి నుంచి, హోంమంత్రి అమిత్ షా
గాంధీనగర్ నుంచి, రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతీ ఇరానీ అమేఠీ నుంచి, లోక్‌సభ
స్పీకర్ ఓం బిర్లా కోట నుంచి పోటీ చేస్తారు.
కేంద్రమంత్రుల్లో మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ నుంచి,
రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి, జ్యోతిరాదిత్య సిందియా గుణ నుంచి, భూపేందర్
యాదవ్ ఆల్వార్ నుంచి, కిరెన్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి పోటీ చేస్తారు. శర్బానంద
సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనేర్ నుంచి, జి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ నుంచి, అర్జున్ ముండా జార్ఖండ్‌లోని ఖుంటీ ప్రాంతం నుంచి ఎన్నికల
బరిలోకి దిగుతారు. హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ, మరోసారి తన నియోజకవర్గం ఖేరీ
నుంచి టికెట్ సంపాదించుకున్నారు. అక్కడే ఆయన కొడుకు కొన్నేళ్ళ క్రితం రైతుల ఉద్యమంలో
నలుగురిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటనలో జైలుపాలయ్యారు.