దేశవ్యాప్తంగా
భారతీయ జనతా పార్టీ(BJP)కి కంచుకోటులుగా ఉన్న లోక్సభ
నియోజకవర్గాల్లో వారణాసి ఒకటి. నరేంద్ర మోదీ 2014, 2019లో ఇక్కడి నుంచే గెలిచి
పార్లమెంటులో అడుగుపెట్టారు. మోదీ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి
నుంచి అక్కడ ఆ పార్టీ గ్రాఫ్ గతంతో పోల్చుకుంటే భారీగా పెరిగింది. ప్రత్యర్థి
పార్టీలకు అందనంత స్థాయిలో ఓట్ షేర్ ను సొంతం చేసుకుంది.
ఆప్
అధినేత కేజ్రీవాల్ కూడా వారణాసి నుంచి పోటీ చేశారు. కానీ ఆయనకు విజయం దక్కలేదు.
2014లో ప్రధాని మోదీపై ఆప్ అధినేత పోటీ దిగి ఓడారు.
భారతదేశంలో
అత్యంత ప్రాచీన, ఆధ్మాత్మిక నగరమైన వారణాసి పార్లమెంట్ స్థానం పరిధిలో ఐదు
అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1957 నుంచి జరిగిన ఎన్నికల్లో ఆ స్థానంలో బీజేపీ
7సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచింది.
1991 తర్వాత ఒక దఫా మాత్రమే
బీజేపీ ఓడింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.
మాజీ
ప్రధాని చంద్రశేఖర్ 1977లో ఇక్కడి నుంచి 47.9 శాతం ఓట్లతో విజయం సాధించి మొదటిసారి
లోక్సభకు ఎన్నికయ్యారు. యూపీలో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ వారణాసి తో పాటు
మరో 11 స్థానాల్లో ఇప్పటి వరకు గెలవలేదు.
2014లో
నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ముందు బీజేపీ కురువృద్ధుడు, రామమందిర
నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం చేసిన ముఖ్యనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి లోకసభకు
ప్రాతినిధ్యం వహించారు.
2014లో
నరేంద్ర మోదీకి మూడు లక్షల ఓట్లు పడగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2019లో
ఎన్నికల్లో ఎస్పీ నుంచి షాలినీ యాదవ్ పోటీ చేయగా ఆమె పై ప్రధాని నరేంద్రమోదీ 4.7
లక్షల ఓట్లతో విజయం సాధించారు.
వారణాసి
నియోజకవర్గంలో హిందూ జనాభా 75 శాతం ఉండగా, ముస్లింలు 20 శాతం, ఇతర మతాల వారు 5
శాతం లోపు ఉన్నారు. 65 శాతం మంది పట్టణ ప్రజానికం ఉండగా, గ్రామీణులు 35 శాతం ఉన్నారు.
ఎస్టీ జనాభా పదిశాతం కాగా, ఎస్సీలు 0.7 శాతం ఉన్నారు.
ప్రధాని
నరేంద్ర మోదీ పాలనలో వారణాసిలో గణనీయమైన అభివృద్ధి పనులు జరిగాయి. కాశీ విశ్వనాథ్
టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుతో భారత రాజకీయ ముఖచిత్రంలో ఈనియోజకవర్గ పరపతి మరింత
ఇనుమడించింది.
ఎస్పీ-కాంగ్రెస్ మధ్య
పొత్తులో భాగంగా ప్రియాంకగాంధీ, వచ్చే
లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ
అధికారికంగా వారణాసి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ప్రధాని మోదీ మూడోసారి పోటీ
చేయడం ఖాయంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.
రాజకీయ పార్టీల అగ్రనేతలు వారణాసిలో
పోటీ చేయడం ద్వారా యూపీలోని 80 లోక్ సభ సీట్లతో పాటు బిహార్ రాజకీయాలపై కూడా
ప్రభావం చూపవచ్చు. అందుకే అగ్రనేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారు.