వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో నెల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు సైకిలెక్కారు.
వైసీపీ ఎంపీ వేమిరెడ్డితోపాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, పదుల సంఖ్యలో సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్‌లో టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశంలో పలువురు నాయకులు టీడీపీలో చేరారు.
వైసీపీలో ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని ఎంపీ వేమిరెడ్డి విమర్శించారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేనన్నారు. జగన్‌రెడ్డి పాలనలో నెల్లూరు ప్రజలకు చిన్న చిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోయామని వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన వెంటవచ్చి టీడీపీలో చేరారు.