Tamil Nadu Christians To Support BJP
తమిళనాడులో ఆశ్చర్యకర పరిణామాలు చోటు
చేసుకుంటున్నాయి. తమిళనాడు క్రైస్తవుల్లో ఒక విభాగమైన ఎఎస్ఎండి న్యూ ఆంగ్లికన్
సినోడ్ సభ్యులు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వాలని
నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యమైన ఈ పరిణామం డీఎంకే సంప్రదాయిక ఓటుబ్యాంకును
దెబ్బతీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎఎస్ఎండి న్యూ ఆంగ్లికన్ సినోడ్ ప్రధాన
కార్యదర్శి డానియెల్ చక్రవర్తి శుక్రవారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో, బీజేపీకి
మద్దతివ్వాలన్న తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అధికార డీఎంకే పట్ల తీవ్ర
అసంతృప్తిని వెళ్ళగక్కారు. క్రైస్తవ సమాజాన్ని డీఎంకే నిర్లక్ష్యం చేస్తోందనీ,
తమతో సరిగ్గా వ్యవహరించడం లేదనీ ఆరోపించారు. డీఎంకే తమపట్ల సవతితల్లిలా
ప్రవర్తిస్తోందంటూ ఆ పార్టీ వైఖరితో క్రైస్తవ సమాజం ఏమాత్రం సంతోషంగా లేదన్నారు. బీజేపీ
క్రైస్తవుల విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందన్న డానియెల్ చక్రవర్తి, తమ
మద్దతును డీఎంకే నుంచి బీజేపీ వైపు మార్చుకుంటున్నామని ప్రకటించారు.
ద్రవిడ ఉద్యమం క్రైస్తవ సమాజాన్ని మోసం చేసిందని,
ఆ ఉద్యమంలో తమకు ఇంకెంతమాత్రం నమ్మకం లేదనీ స్పష్టం చేసారు. బీజేపీకి తమ మద్దతు
కేవలం లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాదనీ, 2026లో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లోనూ
బీజేపీతోనే నిలుస్తామనీ వెల్లడించారు. ‘‘ద్రవిడ ఉద్యమాల పేరుతో క్రైస్తవులు ఇంకెంతమాత్రం
మోసపోరు. ఇకపై వారికి మద్దతివ్వరు’’ అని ప్రకటించారు.
ద్రవిడ పార్టీలు అవినీతిలో కూరుకుపోయారని ఆయన మండిపడ్డారు.
‘‘ద్రవిడ పార్టీలకు పదేపదే ఓటు వేస్తూ వస్తున్నాం. వారు మన ధనాన్ని లూటీ
చేస్తున్నారు, శవపేటికల్లో దాచుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలన నైపుణ్యాలను డానియెల్
చక్రవర్తి మెచ్చుకున్నారు. మోదీ నాయకత్వంలో అంతరిక్ష పరిశోధనల నుంచి సంక్షేమ పథకాల
వరకూ భారత్ సాధిస్తున్న ఘన విజయాలను ప్రశంసించారు. తమ సామాజికవర్గం బీజేపీ,
నరేంద్రమోదీల వెంట నిలుస్తుందని చెబుతూనే భవిష్యత్తు గురించి హెచ్చరించారు. ‘‘రేపు
వాళ్ళు కూడా తప్పు చేస్తే, వాళ్ళని కూడా వదిలివేస్తాం’’ అని ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వాలన్న నిర్ణయం
ద్రవిడ ఉద్యమాల పట్ల వ్యతిరేకత, బీజేపీ విధానాల పట్ల సానుకూలతగా డానియెల్
చక్రవర్తి వివరించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడ, మాజీ పోలీస్ అధికారి అన్నామలై
రాష్ట్రవ్యాప్త యాత్రను చక్రవర్తి ప్రశంసల్లో ముంచెత్తారు.
ఎఎస్ఎండి న్యూ ఆంగ్లికన్ సినోడ్ ప్రకటన నేపథ్యం కూడా
ఆసక్తికరంగా ఉంది. చెన్నిమలై కొండను ఏసుకొండగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ
ప్రయత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా
అండ్ నార్త్ ఇండియా మిషనరీ డయోసీస్ ఆర్చిబిషప్ గుణశేకరన్ శామ్యూల్ ఒక క్షమాపణ
ప్రకటన విడుదల చేసారు. చెన్నిమలై కొండ మీద ప్రార్థనలు జరిపినందుకు క్రైస్తవుల
తరఫున హిందువులకు క్షమాపణలు చెబుతూ ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేసారు.
న్యూ ఆంగ్లికన్ సినోడ్‌తో పాటు మరికొన్ని
క్రైస్తవ డినామినేషన్లు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీ
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసించాయి. ఇంకా, ముస్లిం సమాజంలోని కొన్ని
వర్గాల నుంచి కూడా బీజేపీకి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు బహిరంగంగానే బీజేపీ,
నరేంద్రమోదీ, అన్నామలైలకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు.
తమిళనాడులోని మైనారిటీ వర్గాలు తమ రాజకీయ
ఆసక్తులను బీజేపీ వైపు మళ్ళించుకుంటుండడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు
దారితీస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తమ పరిధిని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్న
తరుణంలో ఇలాంటి పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.