Abu Dhabi temple is open for general public from 1 March
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతనెల అబూధాబీలో
ఆవిష్కరించిన బీఏపీఎస్ హిందూ ఆలయంలో భక్తులకు దర్శనం మార్చి 1నుంచీ మొదలైంది.
ఆలయాన్ని దర్శించుకునే భక్తులు అనుసరించాల్సిన నియమావళిని మందిరం వెబ్సైట్లో
పేర్కొన్నారు.
‘‘మెడ నుంచి పాదాల దాకా శరీరాన్ని కప్పుకోవాలి.
టోపీలు, టీషర్ట్లు, ఇబ్బందికరమైన దుస్తులు అనుమతించరు. శరీరం కనిపించేలా ఉండే
దుస్తులు, ఒంటిని హత్తుకుపోయినట్టుండే దుస్తులతో గుడికి రాకూడదు. భక్తుల దృష్టిని
మళ్ళించేలాంటి దుస్తులు లేదా వస్తువులు ధరించకూడదు’’ అని నియమావళి స్పష్టం
చేసింది.
ఆలయం ఆవరణలోకి పెంపుడు జంతువులను తీసుకువెళ్ళకూడదు.
బైటినుంచి ఆహారపదార్ధాలు, పానీయాలు తీసుకుని వెళ్ళకూడదు. ఆలయ ఆవరణలో డ్రోన్స్
వినియోగం నిషిద్ధం. గుడి ఆవరణలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడడానికి, ఆవరణను
క్రమబద్ధంగా నిర్వహించడానికి ఈ నియమావళి తప్పనిసరి అని మందిర నిర్వాహకులు
వెల్లడించారు.
బోఛాసన్వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్
స్వామినారాయణ్ (బీఏపీఎస్) సంస్థ నిర్మించిన ఈ ఆలయం అబూధాబీలో మొట్టమొదటి హిందూ
మందిరం. దుబాయ్-అబూధాబీ హైవేలో అల్ మురేఖా అనే ప్రదేశం వద్ద 27 ఎకరాల్లో ఈ గుడి
కట్టారు. ఈ మందిరాన్ని రూ.700 కోట్ల నాగర శైలిలో ఇసుకరాయి, పాలరాతితో నిర్మించారు.
2024 ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగిన ఆవిష్కరణ
కార్యక్రమానికి సుమారు 5వేల మంది అతిథులు హాజరయ్యారు. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద
హిందూ మందిరం ఇది. యునైటెడం అరబ్ ఎమిరేట్స్‌లో మరో మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి.