Bangalore Blast: Accused identified in CCTV footage
బెంగళూరు రామేశ్వరం కెఫేలో శుక్రవారం నిన్న
జరిగిన పేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్‌లో
గుర్తించారు. వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఉన్న కెఫేలోకి ఒక వ్యక్తి బ్యాగ్‌తో అడుగుపెట్టినట్లు
పోలీసులు గమనించారు. అతను ఆ బ్యాగ్‌ని లోపల పెట్టి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే
పేలుడు చోటుచేసుకున్నట్లు తేలింది. అతనితో పాటు ఉన్న మరోవ్యక్తిని పోలీసులు
అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాన నిందితుడు తన ముఖాన్ని మాస్క్, టోపీ, కళ్ళద్దాలతో
దాచుకున్నాడు. హోటల్‌లోపల ఉన్న కెమెరాల్లో అతను ఇడ్లీలు తీసుకువెడుతున్నట్లు
నమోదయింది. పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్ధాల
చట్టాలలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు.
పేలుడు మధ్యాహ్నం పన్నెండున్నర, ఒంటిగంట మధ్యలో
జరిగింది. మరికొద్దిసేపటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సంఘటనా
స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టింది.
ఆ పేలుడులో పదిమంది గాయపడ్డారు. వారిలో కెఫే స్టాఫ్ కూడా ఉన్నారు. వారందరూ చికిత్స
పొందుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ సంఘటనను రాజకీయకోణంలో
చూడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. దర్యాప్తుకు సహకరించాలని కోరారు. ఈ పేలుడుకు
కారణం ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ అయి ఉండవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, హోంమంత్రి
జి పరమేశ్వర సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ‘’28-30ఏళ్ళ వయసులోని యువకుడు
మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో కెఫేలోకి వచ్చాడు. కౌంటర్‌లో రవ్వ ఇడ్లీ తీసుకున్నాడు.
కెఫే పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర తన బ్యాగ్ పెట్టాడు. అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఒక
గంట తర్వాత పేలుడు జరిగింది’’ అని శివకుమార్ చెప్పారు.
ఆ ఘటన గురించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు
ప్రారంభించింది. వారితో పాటు పలు బృందాలు పరిశోధనలో పాల్గొంటున్నాయి. అది బాంబు
పేలుడేనని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ నిర్ధారించారు. అయితే ఎవరికీ ప్రమాదకర
స్థాయిలో గాయాలవలేదని వివరించారు.
రామేశ్వరం కెఫే నిర్వాహకులు ‘‘పేలుడు కెఫే కిచెన్‌లో
జరిగిందని ముందు అనుకున్నాం, కానీ తర్వాత కస్టమర్ ఏరియాలో జరిగిందని అర్ధమైంది.
కిచెన్ దగ్గర ఎలాంటి గాయాలు, లేదా రక్తం జాడలూ లేవు’’ అని చెప్పారు. ‘‘సీసీటీవీ
ఫుటేజ్ చూసాము. అందులో ఒక వ్యక్తి మాస్క్, మఫ్లర్ ధరించి కౌంటర్ దగ్గరకి వచ్చి
రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. తన ఆర్డర్ తీసుకుని ఒక మూలకు వెళ్ళాడు. తినేసిన తర్వాత
అక్కడ ఒక బ్యాగ్ వదిలిపెట్టి బైటకు వెళ్ళిపోయాడు. ఇది చాలా దురదృష్టకరమైన,
బాధాకరమైన సంఘటన. అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నాం. బాధితులకు,
వారి కుటుంబాలకు అండగా ఉంటాం. వారికి కావలసిన సాయం చేస్తాం’’ అని నిర్వాహకులు చెప్పారు.
ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాల కోసం
అన్వేషిస్తున్నాయి. పేలుడు పదార్ధాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉదయం
ఎన్ఎస్‌జి కమాండోలు, బాంబ్‌స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.