Rinky Chakma, former Miss India Tripura, dies of Cancer
at 28
మాజీ ‘మిస్ ఇండియా త్రిపుర’ రింకీ చక్మా క్యాన్సర్‌తో
పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. చనిపోయేనాటికి ఆమె వయసు 28ఏళ్ళు మాత్రమే. క్యాన్సర్
చికిత్సలో భాగంగా రింకీ చక్మా శస్త్రచికిత్స కూడా చేయించుకుంది. అయినా ఫలితం
లేకపోయింది. రెండేళ్ళ పాటు ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి ఓడిన రింకీ, కన్నుమూసింది.
రింకీ చక్మాకు రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లు 2022లో బైటపడింది.
దానికి చికిత్స తీసుకుంటే నయమవుతుందని భావించినా, అది అక్కడితో ఆగలేదు.
ఊపిరితిత్తులకు, తలలోని భాగాలకు వ్యాపించింది. చివరికి బ్రెయిన్ ట్యూమర్ కూడా
ఏర్పడింది.
రింకీ చక్మా గత రెండేళ్ళుగా ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్
హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 22న అక్కడే
ఐసీయూలో చేర్చారు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ఆమెను వెంటిలేటర్ మీద
ఉంచారు. అయినా రింకీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఊపిరితిత్తులు మరింత క్షీణించిపోయాయి. వారం
రోజులు వెంటిలేటర్ మీద ఉన్న రింకీ, ఫిబ్రవరి 29న తుదిశ్వాస విడిచింది.
రింకీ చక్మా తన పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో
ఒక పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ తన శరీరంలో కుడివైపు అంతా వ్యాపించివేసిందనీ, కెమోథెరపీ
చేయించినా అది తగ్గడానికి 30శాతం అవకాశం మాత్రమే ఉందనీ వెల్లడించింది. బ్రెయిన్
ట్యూమర్‌కు ఇంకా సర్జరీ చేయవలసి ఉందని వివరించింది. తను, తన కుటుంబం సంపాదన మొత్తం
తన చికిత్సకే ఖర్చయిపోయిందనీ, దాతలు సాయం చేయాలనీ కోరింది. అంతలోనే, కెమోథెరపీ
చేయించుకుంటూ ఉండగానే, రింకీ చక్మా చనిపోయింది.