తమిళనాడులో
డీఎంకే ప్రభుత్వం రేపిన ‘చైనా ఫ్లాగ్ స్టిక్కర్’ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.
ఇస్రో కు సంబంధించిన వార్తాపత్రిక ప్రకటనలో చైనా జెండారంగుల స్టిక్కర్ ను అచ్చు
వేయించిన స్టాలిన్ ప్రభుత్వం, విపక్షాల నుంచి దేశ ప్రజల నుంచి వ్యతరేకత వ్యక్తం కావడంతో చెంపలేసుకుంది. అనుకోకుండా
జరిగిన పొరపాటు అంటూనే భారత్-చైనా మధ్య విభేదాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది.
డీఎంకే
ప్రభుత్వం తీరును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ఏకిపారేస్తున్నారు. ఈ విషయంలో
తమిళనాడు బీజేపీ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కు చురకలు అంటించింది. ముఖ్యమంత్రి
స్టాలిన్, పుట్టినరోజు(మార్చి1) సందర్భంగా చైనా జాతీయభాష(మాండరిన్) లో జన్మదిన
శుభాకాంక్షలు తెలిపింది. చైనా జపం చేస్తోన్న డీఎంకే ప్రభుత్వ సారథి స్టాలిన్ కు ఆయనకు
ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించింది. ‘‘మీరు(స్టాలిన్) కలకాలం సంతోషంగా ఆరోగ్యంగా
ఉండాలని కోరుకుంటున్నాం’’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తమిళనాడులోని
తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టణంలో ఇస్రో రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్
నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దినపత్రికలో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన
ప్రకటనలో రాకెట్ కు చైనా జెండా రంగులు ఉన్నాయి. మంత్రి అనితా రాధాకృష్ణన్ పేరిట ఈ
యాడ్ జారీ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ
కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
దేశప్రజలను
భారతీయశాస్త్రవేత్తలను అవమానించేలా స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా
వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఘటనకు తమిళనాడు మంత్రి రాధాకృష్ణన్ మసిపూసి మారేడుకాయ
చేసే ప్రయత్నం చేశారు. ప్రకటనలో పొరపాటు జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
తమకు వేరే ఉద్దేశం లేదని భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉందన్నారు.
పత్రికాప్రకటనలో
చైనా జెండాను చూడగల్గిన ప్రధాని మోదీకి గత పదేళ్ళలో భారత భూభాగంలో చైనా అడుగుపెట్టిందనే
నివేదికలు కనబడటం లేదా అని డీఎంకే ఎంపీ విల్సన్ విమర్శించారు.