ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్య ఘర్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో కోటి ఇళ్లకు రాయితీపై సోలార్ విద్యుత్ పరికరాలు అందించనున్నారు. నెలకు కనీసం 300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. రూ.75,021 కోట్లతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమకు, దాని అనుబంధ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని, తద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మూడు కిలో వాట్ల వరకు కేంద్రం రాయితీ (pm solar ghar) అందిస్తుంది. ఒక్కో కిలోవాట్‌కు 30 వేల చొప్పున, మొదటి 2 కిలోవాట్లకు రూ.60 వేల రాయితీ అందిస్తారు. 3 కిలోవాట్ల యూనిట్లకు రూ.78వేల రాయితీ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద వినియోగదారులకు దాదాపు 50 శాతం రాయితీ అందుతుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా కనీస వడ్డీ రేటుకు అంటే కేవలం 7 శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని కూడా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెళ్ల ద్వారా 30 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.వినియోగదారులు తమకు అవసరమైన విద్యుత్ వాడుకుని మిగిలింది గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు. ఈ పథకం పూర్తైతే ఏటా 720 మిలియన్ టన్నుల కాలుష్యం తగ్గనుందని అంచనా.