AP BJP to hold protests against Sandeshkhali incidents
పశ్చిమబెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో
మహిళలపై అత్యాచారాలు, హత్యల ఘటనలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా
ఆందోళనలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పిలుపునిచ్చారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్
కాంగ్రెస్ నాయకులు సందేశ్‌ఖాలీలో మహిళలపై వరుస దాడులు, సామూహిక
అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఆ సంఘటనలను
నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని
పిలుపునిచ్చారు. భర్తల ఎదుటే అత్యాచారాలు,హత్య లు జరగడంపై
గళం ఎత్తాలి,అక్కడ ఘాతుకాలకు బలైన కుటుంబాలకు సమాజం
అండగా ఉంటుందన్న సందేశం ఇచ్చే విధంగా ఆందోళన కార్యక్రమాలు ఉండాలని పిలుపునిచ్చారు.
బిజెపి శ్రేణులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ
పురందరేశ్వరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సంఘటనలను ప్రస్తావించారు.ప్రతీ జిల్లా కేంద్రంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు
ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.