కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు విధానసభలో నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేసి 24 గంటలు గడచిపోయినా ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఇంకా నివేదిక అందాల్సి ఉందని, అది వచ్చాక చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినా..బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించలేదు.
మేము స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాం. మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోసం పోరాటం చేస్తున్నారు. మీరు అసలు స్వాతంత్ర్యం కోసం ఏనాడూ పోరాడలేదంటూ సీఎం సిద్దరామయ్యా చురకలు వేశారు. ఏనాడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడని వ్యక్తులు నేడు రాజ్యాంగం మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.విధాన సభ ఆవరణలో ఎవరూ కూడా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయలేదని కాంగ్రెస్ నేత హుస్సేన్ చెప్పారు. తాను స్వాంతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని పార్టీని, దేశాన్ని గౌరవిస్తానని ఆయన అన్నారు.