పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై జరిగిన లైంగిక దాడుల వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులతోపాటు, ఈడీ, సీబీఐ కూడా అరెస్ట్ చేసుకోవచ్చని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది. పరారీలో ఉన్న షాజహాన్‌ను అరెస్ట్ (sandeshkali violence) చేయవచ్చని ఈ నెల 26న హైకోర్టు చెప్పింది. రాష్ట్ర ఏజీ మరింత వివరణ కోరడంతో మరోసారి అదే విషయాన్ని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులే దాచారంటూ బీజేపీ నేత సువేందు అధికారి చెపుతున్నారు. పోలీసుల కస్టడీలోనే షాజహాన్ సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. అతనికి అన్ని సదుపాయాలు పోలీసులు సమకూరుస్తున్నారని కూడా వెల్లడించారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ రూం కేటాయించారని సువేందు చెప్పారు.
సువేందు ఆరోపణలను తృణమూల్ నేతలు ఖండిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.