China Flag on Indian Rocket in DMK Advertisement
మాట మాట్లాడితే దక్షిణభారతదేశాన్ని ప్రత్యేక దేశంగా
ప్రకటించాలంటూ తమ వేర్పాటువాద బుద్ధి చూపించే డీఎంకే, ఈసారి ఏకంగా భారత రాకెట్‌పై
చైనా జెండా బొమ్మ ముద్రించింది. ఇస్రో కొత్త లాంచ్‌ప్యాడ్‌కు శంకుస్థాపన సందర్భంగా
డీఎంకే ఇచ్చిన ప్రకటనలో చైనా రాకెట్‌ను ముద్రించారు. ఇది మన శాస్త్రవేత్తలకు తీరని
అవమానం అంటూ ప్రధాని మోదీ డీఎంకేపై మండిపడ్డారు.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో,
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్‌ను ఉపయోగిస్తోంది.
ఐతే, చిన్నచిన్న ఉపగ్రహాల ప్రయోగానికి అది ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. దాంతో,
గతేడాది కేంద్రప్రభుత్వం మరో కొత్త లాంచింగ్ప్యాడ్ను ప్రకటించింది. దాన్ని
తమిళనాడు తూత్తుక్కుడి జిల్లా కులశేఖరపట్టణంలో నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి
నరేంద్రమోదీ దానికి ఇవాళ శంకుస్థాపన చేసారు.
ఆ సందర్భంగా స్థానిక పత్రికల్లో తమిళనాడు మంత్రి
అనితా రాధాకృష్ణన్ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి
స్టాలిన్, కనిమొళి, ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రాకెట్ బొమ్మ ముద్రించారు. అయితే ఆ రాకెట్
మీద చైనా జెండాను ముద్రించడం వివాదానికి దారితీసింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తీవ్రంగా స్పందించారు. అంతరిక్ష రంగంలో భారత్ పురోగతిని అంగీకరించడానికి డీఎంకే
సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ‘‘తమిళనాడు ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో వారు
ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఆ ప్రకటనల్లో సైతం భారత అంతరిక్ష రంగానికి చెందిన
బొమ్మ పెట్టడం వారికి ఇష్టం లేదు. అంతరిక్ష రంగంలో మన దేశం సాధిస్తున్న విజయాలను
ప్రపంచం ముందు చూపడం వారికి ఇష్టం లేదు. వారు మన శాస్త్రవేత్తలను అవమానించారు. మన
అంతరిక్ష రంగాన్ని అవమానించారు. మీరు చెల్లించిన పన్నుల ఆదాయాన్ని అవమానించారు.
ఇలాంటి చర్యలకు డీఎంకేను శిక్షించి తీరాలి’’ అంటూ మండిపడ్డారు.
తమిళనాడు బీజేపీ
అధ్యక్షుడు అన్నామలై కూడా డీఎంకే ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘డీఎంకే
మంత్రి అనితా రాధాకృష్ణన్ ఇచ్చిన ప్రకటన, వారి పార్టీకి చైనా పట్ల ఉన్న నిబద్ధతను,
భారతదేశపు సార్వభౌమత్వం పట్ల ఉన్న చిన్నచూపునూ తెలియజేస్తోంది. అవినీతిలో
మగ్గిపోతున్న డీఎంకే, కులశేఖరపట్టణంలో ఇస్రో రెండో లాంచ్‌ప్యాడ్‌ను ప్రకటించగానే
దానిపై తమ స్టిక్కర్లు అతికించుకోడానికి ఆరాటపడిపోతోంది’’ అంటూ ఎక్స్ మాధ్యమంలో
ట్వీట్ చేసారు.