కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్
ప్రదేశ్ ప్రభుత్వానికి అవిశ్వాస గండం పొంచి ఉంది. రాజ్యసభ
ఎన్నికల్లో ఆ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు క్రాస్
ఓటింగ్ పాల్పడ్డారు. నిన్న (మంగళవారం)జరిగిన
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో కొంతమంది
ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీకి ఓటేయడంతో ఆ పార్టీలో రేగిన అసంతృప్తి
బహిర్గతమైంది. మరోవైపు, రాష్ట్రమంత్రి
విక్రమాదిత్య సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం పుట్టడంతో బీజేపీ
శాసనసభా పక్షం అప్రమత్తమైంది. మాజీ సీఎం జైరాం ఠాకుర్ నేతృత్వంలో ఆ పార్టీ
ఎమ్మెల్యేలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
పెట్టేందుకు అనుమతి కోరారు.
హిమాచల్
నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్ష్ మహాజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు డుతుందని
వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయన్నారు. నైతిక బాధ్యతగా సీఎం సుఖ్విందర్ రాజీనామా
చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన రెబల్
ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో పంచకుల నుంచి రహస్యప్రాంతానికి
వెళ్లినట్లు తెలుస్తోంది.
సీఎం సుఖ్విందర్‌పై రెబల్స్ కొంతకాలంగా అసంతృప్తిగా
ఉన్నారని, ముఖ్యమంత్రిని
మార్చాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌ను విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగగా 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సభ
నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశారు.
68 సభ్యులున్న
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40,
మంది
ఎమ్మెల్యేల బలంగా ఉండగా బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
నిన్న జరిగిన
రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు
స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం సమం
కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. దాంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌ను
అదృష్టం వరించగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఓడారు.