Supreme Court orders to remove illegal mosque in Chennai
తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రభుత్వ స్థలంలో చట్టవిరుద్ధంగా
నిర్మించిన మసీదును తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమంగా నిర్మించే
స్థలాలు ఏనాడూ మతాన్ని ప్రబోధించడానికి సరైన వేదికలు కాబోవని వ్యాఖ్యానించింది.
రహదారుల మీద, లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లో
అనధికారికంగా గుడి, చర్చ్, మసీదు లేదా గురుద్వారా వంటి మతపరమైన నిర్మాణాలు
చేపట్టకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలకు, అలాంటి అనధికారిక నిర్మాణాలను చట్టబద్ధం
చేయరాదని అన్ని రాష్ట్రాల హైకోర్టులకూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
తాజా కేసులో జస్టిస్ సూర్యకాంత్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ
తీర్పును మరొక్కసారి గుర్తుచేసింది.
చెన్నైలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మసీదును
తొలగించాలంటూ మద్రాస్ హైకోర్ట్ 2023 నవంబర్ 22న తీర్పునిచ్చింది. దానికి
వ్యతిరేకంగా ‘హిదా ముస్లిం వెల్ఫేర్ మజీద్-ఎ-హిదయా అండ్ మదరసా’ అనే ముస్లిం సంస్థ
సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. ఆ అప్పీలుపై ఇప్పుడు మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ముస్లిం సంస్థ పక్షాన సీనియర్ న్యాయవాది ఎస్
నాగముత్తు వాదించారు. ముస్లిం ట్రస్టు ఆ భూమిని కొనుగోలు చేసిందని, మసీదు వల్ల
అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ చెప్పారు. అంతేకాదు, ఆ భూమి చాలాకాలంగా
ఖాళీగా పడుందని, అక్కడ మసీదు కట్టుకుంటే తప్పేంటనీ ప్రశ్నించారు.
అయితే ఆ భూమి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్
అథారిటీకి చెందిన భూమి అని, అక్కడ ముస్లిములు ఎలాంటి అనుమతీ లేకుండానే నిర్మాణాలు
చేపట్టారనీ కోర్టు గమనించింది. ‘‘ఆ భూమి ప్రభుత్వానికి చెందినది. మీకు దానిమీద ఏ
హక్కూ లేదు’’ అని స్పష్టం చేసింది.
‘‘ఈ కేసులో పిటిషనర్ ఆ స్థలానికి యజమాని కాదు.
చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ –
సీఎండీయేకు మాత్రమే ఆ అధికారం ఉంది. పిటిషనరే
అనధికారికంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఉన్నారు. అక్కడ మసీదు కట్టడానికి అనుమతి కోసం
పిటిషనర్ ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదు. ఆ మసీదును పూర్తిగా చట్టవిరుద్ధంగా,
అక్రమంగా నిర్మించారు. 2020 డిసెంబర్ 9న సీఎండీయే అధికారులు నోటీసులు జారీ
చేసినప్పటికీ ఆ అక్రమ కట్టడం ఏ అడ్డంకీ లేకుండా అలాగే కొనసాగుతూ వచ్చింది.
హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు’’ అని
సుప్రీంకోర్ట్ బెంచ్ విస్పష్టంగా తేల్చిచెప్పింది.
ముస్లిం సంస్థ పిటిషన్‌ను
డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు, అక్కడ అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించడానికి 2024
మే 31 వరకూ గడువిచ్చింది.