రాబోయే
రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేంద్రమంత్రి రాజ్నాథ్
సింగ్ అన్నారు. ఏపీ సర్కారు పై విమర్శలు గుప్పించిన రాజ్నాథ్ సింగ్, కేంద్రం
కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దోచుకుతింటున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
పర్యటనలో భాగంగా విజయవాడ, ఏలూరు, విశాఖలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. వైసీపీ
పాలనలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని
దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందన్నారు.
పోర్టులు,
హైవేలు నిర్మించి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రప్రభుత్వం దోహదపడిందని
వివరించారు. జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ.4 వేల కోట్లు
కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం పేదలకు తాగునీరు సరఫరా చేయడం విఫలమైందని
విమర్శించారు.
బీజేపీ
బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేంద్రమంత్రి రాజ్నాథ్, కేంద్రప్రభుత్వ
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వమన్నారు. వచ్చే ఎన్నికల్లో
బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం ఖాయమన్నారు.
అవినీతి నిర్మూలనకు, దుష్టులను శిక్షించేందుకు బీజేపీకి ఓటు వేయాలని
ప్రజలను కోరాలని చెప్పారు. పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా బీజేపీ పాలన అవసరమన్నారు. అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే దేశంలో బీజేపీ
అధికారంలో ఉండాల్సిందేనన్నారు.