Ongole MP Magunta Srinivasulu Reddy Quits YSRCP
అధికార వైఎస్ఆర్సిపి నుంచి మరో ఎంపీ బైటకు
వచ్చేసారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసారు.
ఈ ఉదయం ఒంగోలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో, మాగుంట
శ్రీనివాసులు రెడ్డి తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీని వదిలిపెడుతున్నామని ఆయన చెప్పారు. తమ
కుటుంబానికి ఆత్మగౌరవం ఉంది తప్ప అహంకారం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 33ఏళ్ళుగా
రాజకీయాల్లో ఉన్నాననీ… 8సార్లు పార్లమెంటు, 2సార్లు శాసనసభ, 1సారి శాసనమండలికి
పోటీ చేసాననీ చెప్పుకొచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ
నియోజకవర్గం బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలబెట్టాలని
నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఒక
ప్రత్యేక గుర్తింపు ఉందని శ్రీనివాసులు రెడ్డి చెప్పుకొచ్చారు.
పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
దగ్గరపడుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ నుంచి ఆరుగురు ఎంపీలు బైటకొచ్చేసారు. మచిలీపట్నం
ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,
నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి,
ఇప్పుడు తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి… ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.
వైఎస్ఆర్సీపీ అధిష్ఠానం వైఖరితో మాగుంట
శ్రీనివాసులు రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నిలబెడతారని తెలుస్తోంది. ఆ నేపథ్యంలో మాగుంట పార్టీకి
రాజీనామా చేసారు. కొద్దిరోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు
సమాచారం.