కాంగ్రెస్,
కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలను ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో
స్నేహం చేసే పార్టీలు కేరళలో మాత్రం విరోధులంటూ దెప్పిపొడిచారు.
కేరళ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో బీజేపీ సమావేశంలో
పాల్గొని ప్రసంగించారు.
తిరువనంతపురంలో ఓ వైఖరి, దిల్లీలో మరోవైఖరి అనుసరించే పార్టీలంటూ
కాంగ్రెస్, లెఫ్ట్ పక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళలో ప్రత్యర్థులుగా ఉండే కాంగ్రెస్
పార్టీ, సీపీఐ(ఎం).. పశ్చిమ బెంగాల్లో మాత్రం మిత్రపక్షాల పేరిట రాజకీయం చేస్తున్నాయని
దుయ్యబట్టారు. పరస్పర రాజకీయ వైరుధ్యాలున్నపార్టీలు ఇండియా కూటమి పేరిట పలు రాష్ట్రాల్లో
సీట్లు చేసుకుంటున్నాయన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అవినీతిపరుడన్న
ప్రధాని మోదీ, కేరళలో గత కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశాయని
గుర్తు చేశారు.
కమ్యూనిస్ట్ నేతలు పలు కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్షాల
‘ఇండీ కూటమి’లో మాత్రం ఇరుపార్టీల(కాంగ్రెస్, లెఫ్ట్) నేతలు దిల్లీలో కూర్చొని
బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్
తాగుతారన్నారు.
కేరళలో ఒకలా, దిల్లీలో మరోలా మాట్లాడే పార్టీలకు తగినబుద్ధి
చెప్పాలని కేరళ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. కేరళలో బీజేపీకి డబుల్ డిజిట్
సీట్లు ఇవ్వాలన్నారు.