దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు తరవాత లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.మధ్యాహ్నం తరవాత పెట్టుబడిదారులు పెద్దఎత్తున కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో దేశీయ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ నష్టాలతో 72723 పాయింట్ల వద్ద మొదలైంది. గరిష్ఠంగా 73161 పాయింట్లకు ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి 305 పాయింట్ల లాభంతో 73095 వద్ద ముగిసింది. నిప్టీ సైతం 76 పాయింట్లు పెరిగి 22198 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి విలువ 82.90కు దిగజారింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలార్జించాయి. యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 82.69 డాలర్లకు చేరింది. స్వచ్ఛమైన గోల్డ్ ఔన్సు 2045 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.