Fearless fighter for freedom, Chandrasekhar Azad
(నేడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి)
భారతదేశంలో నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు
లక్షల మంది పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితం. ఇవాళ మనం పాశ్చాత్య ప్రపంచపు
ప్రభావాలకు లోనై, మన ముందరి తరాల వారు చేసిన త్యాగాలను మరచిపోతున్నాం. అలాంటి
గొప్ప త్యాగధనుల్లో ఒకరు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన అసలు పేరు చంద్రశేఖర్.
స్వాతంత్ర్యం కావాలి అంటూ ఇచ్చిన నినాదం కారణంగా ఆజాద్ ఆయన పేరులో అవిభాజ్య
భాగమైంది.
చంద్రశేఖర్ 1906 జులై 23న మధ్యప్రదేశ్ ఝబువా
జిల్లా భావ్రా గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి జాగరణీ దేవి, తండ్రి పండిత
సీతారామ్ తివారీ. చంద్రశేఖర్ ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో పూర్తయాక తల్లి
అతన్ని సంస్కృత పండితుణ్ణి చేయడం కోసం వారణాసిలోని కాశీ విద్యాపీఠానికి పంపించాలని
తన భర్తపై ఒత్తిడి తెచ్చింది. 1921 డిసెంబర్లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం
ప్రారంభించారు. అప్పటికి 15ఏళ్ళ బాలుడైన చంద్రశేఖర్, ఆ ఉద్యమంలో చేరాడు. ఆ
సందర్భంగా అరెస్ట్ అయినప్పుడు కోర్టులో మేజిస్ట్రేట్ అడిగినప్పుడు తన పేరు ఆజాద్
అని, తన తండ్రి పేరు స్వాతంత్ర్యం అనీ, తన నివాసం జైలులో అనీ చెప్పాడు. దాంతో
చిర్రెత్తుకొచ్చిన న్యాయమూర్తి ఆ బాలుడికి 15 కొరడాదెబ్బలు, 15రోజుల జైలుశిక్ష
విధించాడు. ఆనాటి నుంచీ ఆ బాలుడు చంద్రశేఖర్ ఆజాద్‌గా ఖ్యాతి గడించాడు.
1922లో గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించాడు. ఆ తర్వాత
ఆజాద్ విప్లవ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్యవాదమే భారతదేశానికి ఘనమైన భవిష్యత్తును
అందిస్తుందని విశ్వసించిన ఆజాద్, ‘హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ’లో
చేరాడు. అక్కడే అతనికి ప్రణవేశ్ ఛటర్జీ అనే యువకుడితో పరిచయమైంది. ప్రణవేశ్, ఆజాద్‌ను
రాంప్రసాద్ బిస్మిల్‌కు పరిచయం చేసాడు. బిస్మిల్ స్థాపించిన హిందుస్తాన్
రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ లక్ష్యాలు ఆజాద్‌ను ఆకట్టుకున్నాయి. కులం,
మతం, జాతి, స్థితి అనే వివక్షలేవీ లేకుండా అందరికీ సమానహక్కులు, సమాన అవకాశాలూ
కలిగి ఉండే స్వేచ్ఛాభారతాన్ని సాధించడమే హెచ్ఆర్ఏ లక్ష్యం. మొదటి పరిచయంలోనే
బిస్మిల్‌ను ఆజాద్ ఆకట్టుకున్నాడు. అలా ఆ సంస్థలో ఆజాద్ శాశ్వత సభ్యుడయ్యాడు.
ఆజాద్ విప్లవ కార్యకలాపాలు దాదాపు అన్నీ బ్రిటిష్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టినవే. రాంప్రసాద్ బిస్మిల్ తన స్వస్థలం షాజహాన్‌పూర్
నుంచే విప్లవ కార్యక్రమాలు రూపొందించి అమలు చేసేవాడు. ఆజాద్ స్వస్థలం కూడా ఆ ఊరే అవడం
కాకతాళీయం. కాకోరీ రైలు దోపిడీ (1926),
వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలు పేల్చివేత ప్రయత్నం (1926), లాలా లజపత్ రాయ్ హత్యకు
కారకుడైన జాన్ పోయాంజ్ సాండర్స్ కాల్చివేత (1928) వంటి దాడుల్లో ఆజాద్
పాల్గొన్నాడు. ఆజాద్ పనిచేస్తున్న విప్లవ సంస్థ హెచ్ఆర్ఎకు, కాంగ్రెస్ సభ్యుడు
అయినప్పటికీ మోతీలాల్ నెహ్రూ, నిధులు సమకూర్చడం విశేషం.
ఆజాద్ కొంతకాలం పాటు తన సంస్థ కార్యకలాపాలను
ఝాన్సీ నుంచి నడిపించాడు. ఝాన్సీకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని ఓర్ఛా అటవీ
ప్రదేశంలో అతను తుపాకి కాల్చడం ప్రాక్టీస్ చేసేవాడు. ఆ విద్యలో అతడు నిష్ణాతుడిగా పేరు
గడించాడు. దాంతో తమ సంఘంలోని ఇతర సభ్యులకు శిక్షణ ఇచ్చేవాడు. అడవి దగ్గరలో సతార్
నది ఒడ్డున హనుమంతుడి గుడి చేరువలో ఆజాద్ ఒక గుడిసె కట్టుకున్నాడు. అతనక్కడ పండిత
హరిశంకర్ బ్రహ్మచారి అనే పేరుతో చాలాకాలం ఉన్నాడు. దగ్గరలో ఉన్న ధిమార్‌పురా
గ్రామంలో పిల్లలకు చదువు చెప్పేవాడు. క్రమంలో అతనికి స్థానిక గ్రామస్తులతో
సత్సంబంధాలు నెలకొన్నాయి. ఆజాద్ సేవలకు గుర్తింపుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం
ప్రభుత్వం ఆ ఊరిపేరును ఆజాద్పురాగా మార్చింది.
ఝాన్సీలో ఉండేరోజుల్లో ఆజాద్ సదర్ బజార్‌లోని
బుందేల్‌ఖండ్ మోటర్ గ్యారేజ్‌లో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సదాశివరావు
మల్కాపుర్కర్, విశ్వనాథ్ వైశంపాయన్, భగవాన్ దాస్ మహౌర్లతో సాన్నిహిత్యం
ఏర్పడింది. వారు అతని విప్లవ సమూహంలో అంతర్భాగమైపోయారు.
1925లో కాకోరీ రైలుదోపిడీ ఘటన తర్వాత బ్రిటిష్
ప్రభుత్వం విప్లవవీరుల కార్యకలాపాలను అణచివేసింది. ఆ దాడిలో పాల్గొన్న రాంప్రసాద్,
అష్ఫకుల్లాఖాన్, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్రనాథ్ లాహిరీలకు మరణశిక్ష విధించింది.
ఆజాద్, కేశవ్ చక్రవర్తి, మురారి శర్మ పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకోగలిగారు.
అనంతర కాలంలో శివ వర్మ, మహావీర్‌సింగ్ వంటి విప్లవకారులతో కలిసి ఆజాద్ హెచ్ఆర్ఏను
పునర్వ్యవస్థీకరించాడు. ఆజాద్ భగవతీచరణ్ వోహ్రాతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన
భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి హెచ్ఆర్ఏను 1928లో హిందుస్తాన్
సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మార్చాడు. వారి ప్రధానలక్ష్యం సోషలిస్టు
సూత్రాల ఆధారంగా దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడమే.
1931 ఫిబ్రవరిలో ఆజాద్ అలహాబాద్ వెళ్ళాడు. అక్కడ
ఫిబ్రవరి 27న ఒక విప్లవ సహచరుణ్ణి కలుసుకోడానికి ఆల్ఫ్రెడ్ పార్కుకు వెళ్ళాడు. ఆ
విషయాన్ని పోలీసులకు ఒక ఇన్ఫార్మర్ ఉప్పందించాడు. సాయుధులైన పోలీసులు అతన్ని
చుట్టుముట్టారు. ఆజాద్ కూడా వారిపై కాల్పులు జరిపాడు. ముగ్గురు పోలీసులను తుదముట్టించాడు,
మరికొందరిని గాయపరిచాడు. ఆ క్రమంలో ఆజాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆజాద్
కలవడానికి వచ్చిన సహచరుడు సుఖ్‌దేవ్‌రాజ్ సురక్షితంగా తప్పించుకోగలిగాడు. కానీ
పోలీసులు ఆజాద్‌ను విడిచిపెట్టలేదు. ఆజాద్ సైతం వారిపై దాడి కొనసాగించాడు.
పోలీసులకు సజీవంగా పట్టుబడకూడదని చేసుకున్న ప్రతిజ్ఞకు కట్టుబడి, చంద్రశేఖర్ ఆజాద్
తన తుపాకితో కాల్చుకుని ప్రాణత్యాగం చేసాడు. అప్పుడు ఆజాద్ ఉపయోగించిన కోల్ట్
తుపాకీ, ఇప్పుడు అలహాబాద్ మ్యూజియంలో ఉంది. ఆ పార్కుకు ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్
పార్క్ అని నామకరణం చేసారు.
పోలీసులు ఆజాద్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం
రసూలాబాద్ ఘాట్‌కు రహస్యంగా పంపించారు. కానీ ఆ విషయం ఎలాగో బహిర్గతమైంది. దాంతో
వందలాది ప్రజలు ఆ ఘటన జరిగిన పార్క్ వద్ద గుమిగూడి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేసారు. మాతృభూమి సేవలో అసువులు బాసిన చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళులర్పించారు.