దిల్లీ
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED)
ఎనిమిదోసారి నోటీసులు జారీ చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్
కేసులో ఈడీ ఇప్పటికే ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడుసార్లు సమన్లు
పంపింది. ఈడీ తాఖీదులు భేఖాతరు చేసిన అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం
లేదు. దీంతో తాజాగా నోటీసులు జారీ చేసిన ఈడీ, మార్చి 4న విచారణకు హాజరుకావాలని
ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఈడీ ఇన్ని సార్లు తాఖీదులు ఇవ్వడం
ఇదే మొదటిసారి.
ఈడీ,
నవంబర్ 2న మొదటిసారి కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయగా, రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా కేంద్ర
దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తమ అధినేతను అరెస్టు చేసి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేసిందని
ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా తమపై నింధలు
వేసి తప్పించుకోవడం ఏంటని, ఆప్ అధినేతను బీజేపీ నిలదీసింది. సమన్లకు
కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. మార్చి 16న ఈ పిటిషన్
విచారణకు రానుంది.
గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22న నోటీసులు జారీ
చేసినా కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఈ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తాఖీదులు పంపినా విచారణకు
గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ తాజాగా ఎనిమిదో సారి నోటీసులు పంపింది.