లోక్సభ
ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా, కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత
లేకపోవడంతో హస్తం శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇండీ కూటమి పక్షాలతో సీట్ల పంపకాల
లెక్కల పంచాయితీ కూడా ఓ పట్టాన తెగని పరిస్థితి. మరో వైపు ఆ పార్టీ అగ్రనేతలు
ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది కూడా అగమ్యగోచరంగా మారింది.
గతంలో
ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన సోనియాగాంధీ, ప్రస్తుతం
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ
స్థానం నుంచి పోటీ చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల
పోటీ చేసి ఓ చోట గెలిచిన రాహుల్, ఈ దఫా ఎన్నిచోట్ల, ఏ ఏ రాష్ట్రాల నుంచి పోటీ
చేస్తారనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
గత ఎన్నికల్లో
రాహుల్ గాంధీ, అమేఠి(ఉత్తరప్రదేశ్), వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేయగా, ఈ సారి ఆ
రెండు స్థానాల్లో పోటీపై ఇంకా డోలాయమానంలో ఉన్నారు. అమేఠిలో బీజేపీ అభ్యర్థి
స్మృతి ఇరానీ చేతిలో ఓడిన రాహుల్, వయనాడ్ లో మాత్రం సీపీఐ అభ్యర్థిపై భారీ మెజారటీతో
గెలిచారు. ఈ సారి వయనాడు నుంచి సీపీఐ మహిళ నేత పోటీ చేస్తున్నారు.
కేరళ
లోని ఎల్డీఎఫ్ కూటమిలో ప్రధాని భాగస్వామిగా ఉన్న సీపీఐ ఈ సారి వయనాడులో పోటీ
చేయబోతుంది. సీపీఐ అగ్రనేత యానీ రాజా వయనాడ్ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు
స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ మరో సీటు వెతుక్కోక తప్పనసరి పరిస్థితి
నెలకొంది. అమేఠిలో పోటీకి ఇండీ కూటమి లో
భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఆసక్తి చూపుతోందని రాజకీయవర్గాల్లో చర్చ
జరుగుతోంది.
కాంగ్రెస్
పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాహుల్ పోటీ చేస్తారనే
విశ్లేషణలు ఉన్నాయి. ఇండియన్ ముస్లింలీగ్,
వయనాడ్ సీటు కోసం పట్టుబట్టింది. గతంలో కేరళలో రెండు స్థానాల్లో పోటీ చేసిన
ఇండియన్ ముస్లిం లీగ్, ఈ సారి మూడో సీటుగా వయనాడ్ ను డిమాండ్ చేసినట్లు కూడా
ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్
పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అలెప్పి నుంచి పోటీ చేస్తున్నారు. ఒకే
రాష్ట్రం నుంచి ఇద్దరు అగ్రనేతలు పోటీ చేయడానికి బదులు రాహుల్ వేరే రాష్ట్రం నుంచి
పోటీ చేస్తే పార్టీ మేలు జరుగుతుందనే ఆ పార్టీ వ్యూహమనే వాదన కూడా ఉంది.
రాయబరేలి నుంచి పోటీకి గాంధీ కుటుంబానికి ప్రియాంక గాంధీ వాద్రా కూడా
ఇష్టపడటం లేదని సమాచారం. 2019లో యూపీలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్నే గెలుచుకుంది.
రాయబరేలీ నుంచి సోనియా ఒక్కరే విజయం సాధించారు.