ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై వేటు వేసినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. శాసనసభలో 8 స్థానాలు ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి లేఖ రాశారు. ఇవాళ దీనిపై గెజిట్ విడుదల కానుంది. రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
వేటు పడిన ఎమ్మెల్యేల్లో వైసీపీకి చెందిన ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిపోయిన కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లు ఉన్నారు. రాష్ట్ర విభజన తరవాత ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలపై వేటు వేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.