సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆధార్ లింకు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా ఓటు వేయవచ్చని సీఈసీ తేల్చి చెప్పింది. ఓటరు కార్డు, లేదా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలతో ఓటు వేయ వచ్చని వివరించింది. పశ్చిమబెంగాల్‌లో లక్షలాది ఓట్లు పనికిరాకుండా చేస్తున్నారంటూ టీఎంసీ నేతలు ఎన్నికల సంఘం అధికారులకు సోమవారంనాడు ఫిర్యాదు చేశారు.
వెనుకబడిన ప్రాంతాల్లో ఓటర్లు ప్రలోభాలకు లోనయ్యే అవకాశముందని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని టీఎంసీ నేతలు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ను కోరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బలగాలు భయబ్రాంతులకు గురిచేశాయని వారు ఫిర్యాదు చేశారు. అలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ, ప్రజల్లో అవగాహన పెంచి ఓటింగ్ శాతం పెంచేందుకు సీఈసీ ప్రయత్నాలు చేస్తోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసులతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.