పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఓ వర్గం మహిళలపై కొందరు అరాచకవాదులు లైంగికదాడులకు దిగారనే ఆరోపణలపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు, ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రధాన నిందితుడు అరెస్ట్ కాకుండా కోర్టులు, పోలీసుల చేతులు కట్టిపడేశాయంటూ స్థానిక టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షాజహాన్ అరెస్ట్‌ను నిలుపుదల చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. షాజహాన్ అరెస్ట్‌పై స్టే ఇవ్వలేదని తెలిపింది.
అనేక నేరాల్లో షాజహాన్ షేక్ నిందితుడిగా ఉన్నాడని, అరెస్ట్ చేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శిని కూడా ఇంప్లీడ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.