Kanneganti Hanumantu, freedom fighter against the British
(నేడు కన్నెగంటి హనుమంతు వర్ధంతి)
సహాయ నిరాకరణోద్యమం ఉధృతంగా కొనసాగుతూన్న రోజుల్లో
బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల పుండు మీద కారం చల్లినట్లు, అటవీ చట్టాలకు సవరణలు
చేసింది. ఆ కొత్త చట్టాలను చాలా కఠినంగా అమలు చేయసాగింది. సవరించిన ఆ కొత్త అటవీ
చట్టాల ప్రకారం పశువులమేత కోసం కానీ, అటవీ సంపదతో జీవనం సాగించేందుకు కానీ అనేక
ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొత్త చట్టం ప్రకారం అడవుల్లో ప్రవేశానికి, సంపద సేకరణకు,
పశుగ్రాసం కోసమూ ప్రభుత్వానికి చెల్లించవలసిన పుల్లరి పన్ను అధికం చేసారు. అసలే
పేదరికంతో మగ్గుతున్న పలనాడు ప్రజలు ఆ సవరించిన కొత్త అటవీ చట్టాలను ధిక్కరించడం
ప్రారంభించారు. ఆ పుల్లరి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారే కన్నెగంటి
హనుమంతరావు. జనం ఆయనను ఆప్యాయంగా హనుమంతు అని పిలిచేవారు. కన్నెగంటి హనుమంతు చాలా
ధనిక కుటుంబం నుంచి వచ్చినవాడు. దానధర్మాలకు వెనుకాడకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు
వచ్చినా తాను స్వయంగా రంగంలోకి దిగి వారి ఇబ్బందులు తీర్చేవాడు. అలా పల్నాడు
ప్రాంతంలో అధికంగా ప్రజాభిమానాన్ని చూరగొన్నవాడు కన్నెగంటి హనుమంతు.
1922 జనవరి 7న గాంధీజీ కొన్ని ప్రాంతాల్లో
పన్నుల, సహాయ నిరాకరణ ఉద్యమాలు చేయవచ్చని అనగానే ఆంధ్ర కాంగ్రెసు బెజవాడలో
సమావేశమైంది. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు నడపాలని
నిర్ణయించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉద్యమం ఉధృతంగా సాగగా గ్రామాధికారులు తమ
ఉద్యోగాలకు రాజీనామా చేసారు. నాయకులు గ్రామాల్లో తిరిగి ప్రజలను పన్నుల నిరాకరణకై
సమాయత్తం చేసారు.
అలాంటి పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వం కొత్త
అటవీ చట్టాలను తెచ్చింది. అడవి సంపద మీద ఆధారపడి జీవిస్తున్నవారు, పశువుల గ్రాసం
కోసం వాటిని అడవులకు తోలేవారు. గతంలో కంటె ఇఫ్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం
అధికమొత్తంలో పుల్లరి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా కన్నెగంటి
హనుమంతు పల్నాడులోని వివిధ గ్రామాల్లో తిరిగి పన్నులు చెల్లించకుండా ప్రజలను
కట్టడి చేసాడు. సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిని
సాకుగా చూపించి బ్రిటిష్ ప్రభుత్వం జనం మీద విరుచుకుపడింది.
1921 ఫిబ్రవరి 26నాడు పలనాడు ప్రజలకు,
ప్రభుత్వానికి మధ్య ‘మించాలపాడు’ గ్రామంలో తీవ్రమైన సంఘర్షణ జరిగింది. కోలగుట్ల
గ్రామానికి శివారు గ్రామమే మించాలపాడు. అక్కడ జరిగిన ఘర్షణ మరింత ఉధృతం కాగానే
ఇరవై మంది పోలీసు కానిస్టేబుళ్ళు, జి.వి రాఘవయ్య అనే సబ్ ఇనస్పెక్టర్ కలిసి వచ్చి
ప్రభుత్వ అధికారులకు, అటవీశాఖ సిబ్బందికి అండగా నిలిచారు. జనం సుమారు మూడువందల
మంది గుమిగూడి పోలీసు పటాలం, ఉద్యోగుల మీద రాళ్ళు విసిరారు.
రిజర్వు పోలీసులను పిలిపించి కాల్పులు
జరిపిస్తానని ఇనస్పెక్టర్ చేసిన హెచ్చరిక వల్ల ప్రయోజనం కనబడలేదు. అప్పుడు ఆయన
నిజంగానే కాల్పులు జరిపించాడు. మొదటి రౌండ్ కాల్పుల్లోనే కన్నెగంటి హనుమంతు, మరో
ఇద్దరు పౌరులు తూటాలు తగిలి నేలకూలారు. వారిలో హనుమంతరావు, అతని సహాయకుడైన
వెల్లంపల్లి శేషుడు కూడా ఉన్నారు. ఆ వార్త విన్నవెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ ‘వెర్నర్’,
జిల్లా పోలీసు అధికారిని, అదనపు సిబ్బందిని వెంటపెట్టుకుని మించాలపాడు
చేరుకున్నాడు. వారు ఆ గ్రామంలో మొత్తం 28మంది పురుషులు, 9మంది స్త్రీలను అరెస్టు
చేసారు.
మరునాడు మరలా కొన్ని అరరెస్టులు జరిగాయి. వారంతా
రెండునెలలు మాచర్ల జైలులో ఉన్న తరువాత నరసరావుపేట డెప్యూటీ కలెక్టర్ అయిన జంబునాథ
అయ్యర్ ఎదుట వారిని హాజరుపరిచారు. వారికి వివిధ రకాల శిక్షలు విధించారు.
అంతకుముందు కోటప్పకొండలో జరిగిన అల్లర్లకు కారణంగా చెప్పి చిన్నపరెడ్డికి ఉరిశిక్ష
విధించినవాడు, తెలుగు విప్లవవీరుడు అన్నాప్రగడ కామేశ్వరరావుకు జీవితంలో తొలిసారి
జైలుశిక్ష విధించినవాడు కూడా ఆ జంబునాథ అయ్యరే.
మించాలపాడు గ్రామంలో జనం మీద పోలీసులు కాల్పులు
జరిపింది ఆరోజు సాయంత్రమైతే, తూటాలు తగిలిన కన్నెగంటి హనుమంతు మరణించినది అర్ధరాత్రి
సమయంలో. అప్పటిదాకా హనుమంతు దగ్గరకు ఎవ్వరినీ పోలీసులు వెళ్ళనివ్వలేదు. హనుమంతు
త్రాగేందుకు మంచినీళ్ళు అడిగినా ఇవ్వనివ్వలేదు. అలా కొన్నిగంటలపాటు యాతన
అనుభవించిన అనంతరం ప్రాణాలు విడిచాడు పలనాటి పుల్లరి పోరాటయోధుడు కన్నెగంటి
హనుమంతు.
ఆ మరునాడు ఆయన భౌతిక శరీరాన్ని కోలగుట్ల సమీపంలో
పోలీసులే ఖననం చేసారు. ఊరిజనం ఎంతో అభిమానంతో ఆయన సమాధి నిర్మించుకొని ఒక శిలాఫలకం
ఏర్పాటుచేయగా, దాన్ని కూడా పోలీసులు పగలగొట్టి ఆ ముక్కలను అక్కడక్కడా వెదజల్లారు.
ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ
వారు తమ సమావేశంలో తీర్మానం చేసినట్లు, కన్నెగంటి హనుమంతు సమాది వద్ద తిరిగి
శిలాఫలకాన్ని ఏర్పాటుచేయడం ఈనాటికీ జరగలేదు. ఆ పుల్లరి పోరాట యోధుడికి మనం ఇచ్చిన
గౌరవం అంతే.