Fifth Anniversary of Balakot Airstrike by Indian Military
సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్‌లోని
బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని
పుల్వామా వద్ద దాడి చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని భారత
సైన్యం చేసిన సాహసోపేతమైన దాడి విజయవంతమైన రోజు. జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం
ఉపేక్ష వహించే ప్రసక్తే లేదని భారతదేశం తన దీటైన చర్యలతో నిరూపించిన రోజు.
2019 ఫిబ్రవరి 26న భారత సైన్యం పాకిస్తాన్‌లోని
బాలాకోట్ మీద గగన ప్రహారాలు (ఎయిర్ స్ట్రైక్స్) చేసింది. చక్కగా ప్రణాళిక రచించి,
అంతే గొప్పగా దాన్ని అమలు చేసిన ఆ ఆపరేషన్, భారత్ తలచుకుంటే ఏం చేయగలదో పాకిస్తాన్‌కు,
ఆ గడ్డ మీద నుంచి మనదేశంపై ఉగ్రదాడులు చేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద
సంస్థలకూ తెలిసొచ్చేలా చేసింది. ఆ మిషన్ విజయాన్ని వెల్లడించడానికి ఉపయోగించిన
కోడ్‌వర్డ్ ‘బందర్ మర్‌గయా’ (కోతి చచ్చిపోయింది).
2019 ఫిబ్రవరి 14న జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలోని ఆత్మాహుతి
దళానికి చెందిన ఒక ఉగ్రవాది, జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా వద్ద భారత పారామిలటరీ
దళానికి చెందిన సైనికుల కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో
40మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ దాడికి భారత్ వేగంగా ప్రతీకారం తీర్చుకుంది.
పక్కాగా సమాచారం సేకరించి, కచ్చితంగా లెక్కలు వేసుకుని, పాకిస్తాన్ అంతర్భాగంలోని
బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత వైమానిక దళం దాడులు చేసింది.
తద్వారా, సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశం ఎంతమాత్రం సహించబోదని స్పష్టమైన, దృఢమైన
సందేశాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది.
భారత సైన్యపు శౌర్య పరాక్రమాలు, కచ్చితమైన
నిఘావ్యవస్థ, దేశ పౌరుల రక్షణకై కృతనిశ్చయం ఎంత బలమైనవో బాలాకోట్ దాడి ప్రపంచానికి
చాటి చెప్పింది. అంతేకాదు, సరిహద్దులకు అవతల నుంచి దండెత్తి వస్తున్న ఉగ్రవాదాన్ని
ఎదుర్కోవడం విషయంలో భారత ప్రభుత్వపు వైఖరిలో సమూల మార్పును చాటిచెప్పింది.
పుల్వామా దాడి తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద
సంస్థ తమ స్థావరాలను మార్చేసింది. శిక్షణలో ఉన్న ఉగ్రవాదులను, వారికి శిక్షణ
ఇస్తున్న ఉగ్రవాదులను బాలాకోట్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక క్యాంప్‌కు
తరలించింది. ఒక కొండ మీద దట్టమైన అడవి మధ్యలో ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో ఉండేలాంటి
వసతులతో ఉంది ఆ క్యాంప్. దాని ఆచూకీ కనుగొన్నారు భారత నిఘావిభాగం అధికారులు. ఆ
వెంటనే భారత బలగాలు దాన్ని భారత్‌కు తక్షణ లక్ష్యంగా చేసుకుంది.
బాలాకోట్ క్యాంప్‌లో సుమారు 700 మంది నివసించడానికి
ఏర్పాట్లున్నాయి. స్విమ్మింగ్‌పూల్ కూడా ఉంది. ఆ క్యాంప్‌ను భారతదేశం దాడి చేయవలసిన
శిబిరంగా గుర్తించింది. భారతదేశంలోని వివిధ ఎయిర్‌బేస్‌ల నుంచి ఫైటర్లు, మిగతా
విమానాలూ బయల్దేరాయి. కానీ వారి గమ్యం ఎవరికీ తెలియకుండా అయోమయం కలిగించారు. కొన్ని
ఎంపిక చేసిన విమానాలు మిగతావాటి నుంచి విడిపోయి, నేరుగా బాలాకోట్‌వైపు
ఎగిరిపోయాయి. ఈ ఆపరేషన్ అత్యంత కచ్చితంగా అమలుచేసారు. తెల్లవారుజామున 3.45 గంటల
నుంచి 4.05 గంటల వరకూ అంటే 20 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
2019 ఫిబ్రవరి 26 ఉదయం, అప్పటి భారత విదేశాంగ
కార్యదర్శి విజయ్ గోఖలే న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు
భారతదేశంపై మరో ఆత్మాహుతి దాడికి సిద్ధపడుతున్నట్లు కచ్చితమైన, విశ్వసనీయ సమాచారం
ఉందని వెల్లడించారు. రాబోయే విపత్తును ముందుగానే గుర్తించడంతో ముందుజాగ్రత్త
చర్యగా దాడి చేయడం నిష్కర్షగా అత్యవసరమైన చర్య అని తేల్చిచెప్పారు. సాధారణ పాకిస్తానీ
పౌరులకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఆపరేషన్ పెద్ద
సంఖ్యలో జేఈఎం ఉగ్రవాదులు, ఉగ్రవాద శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి దళ
సభ్యులూ అందరూ ఉన్నారు.
బాలాకోట్ శిబిరాన్ని మౌలానా యూసఫ్ అజర్ అలియాస్
ఉస్తాద్ గౌరీ నిర్వహించేవాడు. అతను జైషే సంస్థ అధిపతి మసూద్ అజార్‌కు బావమరిది. ఉగ్రవాద
స్థావరాల నిర్వహణలో దిట్ట. సాధారణ జనజీవనానికి దూరంగా ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో
నిర్వహించే ఆ క్యాంప్‌లో కొత్త ఉగ్రవాదులకు ఆయుధాలు వాడడంలో అత్యంత ఆధునిక శిక్షణ
ఇచ్చేవారు. పేలుడు పదార్ధాలు వాడడం, యుద్ధక్షేత్రంలో వ్యూహాలు, సైనిక బలగాల
కాన్వాయ్‌లపై దాడులు, ఐఈడీల తయారీ, ఆత్మాహుతి దాడులు, వివిధ దాడుల కోసం వాహనాల
చోరీ, ప్రతికూల క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మనుగడను కాపాడుకునే ఎత్తుగడలు వంటి
అంశాల్లో ఉగ్రవాదులకు శిక్షణ సాగేది. అలాంటి స్థావరాన్ని సమూలంగా నిర్మూలించేసాయి
భారత విమానాలు.
బాలాకోట్ గగన ప్రహారాల విజయం కేవలం సైనిక విజయం
మాత్రమే కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు చర్యలకు అంతర్జాతీయ మద్దతును
కూడగట్టడంలో గొప్ప దౌత్య విజయం కూడా. ఆ దాడుల తర్వాత ప్రపంచ దేశాలు భారతదేశానికి
ఆత్మరక్షణ కోసం దాడులు చేసే హక్కు ఉందని ఒప్పుకున్నాయి. ఉగ్రవాదం అనే బీభత్సాన్ని
తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలంటూ
ఆ దేశానికి హితవు పలికాయి.
బాలాకోట్ వైమానిక దాడులు జరిగిన ఈ రోజును గుర్తు
చేసుకోవడం ద్వారా భారతదేశం తమ సైనిక బలగాలు చేసిన, చేస్తున్న త్యాగాలను
తలచుకుంటోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో మన సైనిక బలగాల అంకిత భావాన్ని
గుర్తు చేసుకుంటోంది. బాలాకోట్ గగన ప్రహారాల్లో పాల్గొన్న వీరులు అత్యద్భుతమైన
ధైర్యసాహసాలను ప్రదర్శించారు. భారత సైనిక బలగాల స్ఫూర్తిని చాటిచెప్పారు.
అంతేకాదు, జాతీయ భద్రత విషయాన్ని మరోసారి చర్చకు
తెరతీసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహాలను, అతివాదంపై పోరులో అంతర్జాతీయ సహకారం
ఆవశ్యకతనూ గుర్తించేలా చేసింది. మనదేశపు రక్షణ విధానాల పునర్మూల్యాంకనం ప్రాధాన్యతను
గుర్తెరిగేలా చేసింది. ఉగ్రవాద ప్రోత్సాహకులకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించవలసిన
తీరును అర్ధం చేసుకునేలా చేసింది. ఒకపక్క మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసే బాలాకోట్
వైమానిక దాడుల ఘటన, మరోవైపు కఠిన కాలంలో భారత ప్రజల సమైక్యత, పట్టుదలకు ప్రతీకగా
నిలిచింది.