సినీ నిర్మాత, డీఎంకే ఎన్ఆర్ఐ విభాగం నేత ఏఆర్ జాఫర్ సాదిక్ అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో కూరుకుపోయారు. గత వారం పూణేలో రూ.2500 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. తీగలాగితే డొంక కదిలింది. ఈ ముఠా వెనుక తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత, డీఎంకె నేత సాదిక్ హస్త ముందని తేలింది. దీంతో డీఎంకే నుంచి సాదిక్‌ను తొలగిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరువు దెబ్బతినేలా చేయడం, క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు.
డ్రగ్స్ వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. డీఎంకే నేత డ్రగ్స్ వ్యవహారంపై సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చుకోవాలంటూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. ఈ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు కూడా విస్తరించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో సాదిక్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సాదిక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతనికోసం వెతుకుతున్నారు.