WB Governor orders DGP for immediate report on arrest of Sandeshkhali
Fact Finding Committee
హిందూ మహిళలపై ఉద్దేశపూర్వక అత్యాచారాలకు పాల్పడుతున్న
తృణమూల్ కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం గురించిన వివరాలు సేకరించేందుకు సందేశ్‌ఖాలీ
వెడుతున్న నిజనిర్ధారణ కమిటీని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్లో సంచలనం
సృష్టించింది. ఆ ఘటనపై తక్షణం నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ సివి ఆనంద బోస్ రాష్ట్ర
డీజీపీని ఆదేశించారు.
సందేశ్‌ఖాలీ వెడుతున్న నిజనిర్ధారణ కమిటీ
బృందాన్ని పశ్చిమబెంగాల్ పోలీసులు ఆదివారం సాయంత్రం దక్షిణ 24పరగణాల జిల్లా భోజేర్హాట్
వద్ద అరెస్ట్ చేసారు. వారు గవర్నర్‌కు ఫోన్ చేసి తమను అక్రమంగా అరెస్టుచేసారనీ, బెదిరిస్తున్నారనీ
వెల్లడించారు. ఆ బృందంలో ఆరుగురు సభ్యులున్నారు. పట్నా హైకోర్టు మాజీ ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. చారు బాలి
ఖన్నా, భావనా బజాజ్, ఓపీ వ్యాస్, రాజ్‌పాల్ సింగ్, అపర్ణా బెనర్జీ, బందనా బిశ్వాస్
కమిటీ సభ్యులు.
ఆదివారం సాయంత్రం వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకువెళ్ళారు. ‘‘వారిని ఒక
చోటు దాటి వెళ్ళవద్దని కోరాము. కానీ వారు వినలేదు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను
చట్టవిరుద్ధంగా దాటడానికి ప్రయత్నించారు. దాంతో వారిని ముందుజాగ్రత్త చర్యగా
అరెస్ట్ చేసాం’’ అని కోల్‌కతా పోలీస్ భంగార్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సైకత్ ఘోష్
మీడియాకు చెప్పారు.
ఈ పరిణామాలపై నిజ నిర్ధారణ కమిటీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ‘‘సందేశ్‌ఖాలీలో మహిళలపై అత్యాచారాల ఘటనల గురించి నిజానిజాలు
తెలుసుకోడానికి మేం అక్కడికి వెడుతున్నాం. కానీ మమ్మల్ని ఆపేసారు. పోలీసులు
ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని అరెస్ట్ చేసారు. అక్కడి బాధితులతో మమ్మల్ని
కలవనీయకుండా ఆపివేసారు. వారు సామాన్య ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు’’ అని చారు
బాలి ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేసారు.
కమిటీలోని మరో సభ్యుడు ఓపీ వ్యాస్ మాట్లాడుతూ
‘‘పోలీసులు మమ్మల్ని అక్రమంగా ఆపివేసారు. మా హక్కులను కాలరాసారు. అందుకే మేమిక్కడ
శాంతియుతంగా కూర్చున్నాం. ఈ విషయం గురించి మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు,
కేంద్ర హోంమంత్రికి, ఆఖరికి ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తాం.
దురదృష్టవశాత్తు బెంగాల్లో రాజ్యాంగ వ్యవస్థలు పతనమైపోయాయి. పోలీసులు చట్టవిరుద్ధమైన
ఆజ్ఞలకు తలొగ్గి అమలు చేస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.
మేము సందేశ్‌ఖాలీలో బాధిత మహిళలను కలుసుకోడానికి ప్రయత్నిస్తుండడమే దానికి కారణం’
అని చెప్పారు.
అంతకుముందు బెంగాల్ మంత్రులు సుజిత్ బోస్, పార్థా
భౌమిక్ సందేశ్‌ఖాలీని సందర్శించారు. అక్కడ ఒక్క మహిళయినా ఎలాంటి దాడి గురించయినా
చెప్పలేదని పార్థా భౌమిక్ మీడియాకు చెప్పారు. దానిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత
మజుందార్ మండిపడ్డారు. ‘‘టీఎంసీ మొదటినుంచీ వాస్తవాలను ఒప్పుకోడానికి నిరాకరిస్తోంది.
కానీ టీఎంసీ ప్రభుత్వానికి చెందిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఇద్దరు మహిళల
వాంగ్మూలాలు నమోదు చేసారు. అత్యాచారాలు జరక్కపోతే వారి వాంగ్మూలాలు ఎందుకు
తీసుకున్నారు?’’ అని నిలదీసారు. ‘‘ఈ కేసును రాష్ట్రపోలీసులు నీరుగార్చేసే ప్రయత్నాలు
చేస్తున్నారు. అందువల్ల ఈ కేసును వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి’’
అని నిలదీసారు.
తృణమూల్ కాంగ్రెస్ఓ నాయకుడు షేక్ షాజహాన్, అతని
అనుచరులు సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలపై పార్టీ కార్యాలయంలో పాల్పడుతున్న అత్యాచారాల
గురించిన వివరాలు నాటకీయ పరిస్థితుల్లో బైటపడ్డాయి. ఆ విషయాలను అణచివేయడానికి మమతా
బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఈ ఘటనపై బీజేపీ తమ ఆందోళనలను ఉధృతం
చేసింది.