పశ్చిమబెంగాల్లో 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో నిరసనలు పెల్లుబికాయి. పెద్దఎత్తున మహిళలు నిరసనల్లో పాల్గొన్నారు. టీఎంసీ నేత అజయ్ మైతీని అరెస్ట్ చేయాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. మహిళలను లైంగికంగా వేధించడం, భూ అక్రమణల్లో షాజహాన్ షేక్ సన్నిహితుడు అజయ్ మైతీ హస్తం కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అంచల్ ప్రాంతానికి టీఎంసీ అధ్యక్షుడిగా ఉన్న మైతీని, తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ మంత్రులు రెండో రోజు కూడా సందేశ్‌ఖాలీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. సమస్యలు పరిష్కరించడానికి రెండు నెలల సమయం కావాలని కోరారు. నిజనిర్ధారణకు ప్రయత్నించిన పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహారెడ్డి బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు అనుమతివ్వాలంటూ కమిటీ సభ్యులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, వారిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. తరవాత వారిని పోలీసులు విడుదల చేశారు.