Assam steps towards implementation of UCC
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం
అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే ముస్లింలలో వివాహాలు, విడాకులకు చెందిన ప్రత్యేక
చట్టాన్ని రద్దు చేయాలని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల మొదట్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి
పౌరస్మృతి బిల్లును ఆమోదించి చట్టరూపం కల్పించింది. అటువంటి చట్టాన్నే తమ
రాష్ట్రంలోనూ చేయడానికి అస్సాం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరో నాలుగు
రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే యూసీసీ బిల్లును శాసనసభ ముందు
ప్రవేశపెట్టడానికి హిమంత సర్కారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అది నిజమే అనిపించేలా, అస్సాం ప్రభుత్వం ఒక
నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు
చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని హిమంత బిశ్వశర్మ క్యాబినెట్లో మంత్రి
జయంత మల్లా బారువా వెల్లడించారు. అలాంటి అంశాలన్నింటినీ ప్రత్యేక వివాహాల చట్టం
పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ముస్లిం వివాహాలు,
విడాకుల చట్టాన్ని రద్దు చేసాక ఏం జరుగుతుంది? ఒకసారి గమనిద్దాం.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఇప్పుడున్న చట్టం ప్రకారం ముస్లిముల వివాహాలు,
విడాకుల రిజిస్ట్రేషన్ స్వచ్ఛందం మాత్రమే తప్ప, తప్పనిసరి కాదు. ఇక రిజిస్ట్రేషన్
ప్రక్రియకు కూడా విధివిధానాలను అమలుచేయాల్సిన పద్ధతి ఇప్పటివరకూ లేదు. ఇకపై
ప్రభుత్వ విధివిధానాల ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది.
ముస్లిం రిజిస్ట్రార్లకు సెలవు
ముస్లిముల వివాహాలు, విడాకులను రిజిస్టర్
చేయడానికి లైసెన్సులున్న ముస్లిం రిజిస్ట్రార్లు, ఇప్పుడీ చట్టాన్ని రద్దు చేసాక
ఆ పని చేయలేరు. రాష్ట్రంలో అలా ముస్లిం పెళ్ళిళ్ళు, విడాకులు రిజిస్టర్ చేయడానికి
94మంది ముస్లిం రిజిస్ట్రార్లు ఉన్నారు. వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద తలకు
రూ.2లక్షలు ఇస్తారు.
రిజిస్ట్రేషన్ రికార్డుల కస్టడీ
ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం
రద్దు తర్వాత… రిజిస్ట్రేషన్ రికార్డులు జిల్లా కమిషనర్లు, రిజిస్ట్రార్ల
అధీనంలోకి వెళతాయి. అస్సాం ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రత్యక్ష
పర్యవేక్షణ నియంత్రణలో ఇకపై ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
బాల్యవివాహాల నివారణ
ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం బాల్యవివాహాలను సైతం
అనుమతిస్తుంది. అమ్మాయిలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21ఏళ్ళు నిండకపోయినా, అలాంటి
పెళ్ళిళ్ళను సైతం రిజిస్టర్ చేసి ఆమోదించే చట్టబద్ధమైన పద్ధతి ఇప్పటివరకూ అమల్లో
ఉంది. ఆ చట్టాన్ని రద్దు చేయడం వల్ల, బాల్యవివాహాలు ఇకపై నేరంగా పరిగణించబడతాయి.
అలాంటి పెళ్ళిళ్ళను నివారించడం సాధ్యమవుతుంది.