కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం ఇటీవల భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష (bharatiya nyaya suraksha) భారతీయ సాక్ష్య బిల్లు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
1860నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1872నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు.
కొత్త చట్టాలు రాజ్యాంగాన్ని కాపాడుతాయని, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్ర హూం మంత్రి అమిత్ షా గత ఏడాది పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతూ చెప్పారు. ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తే భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా తయారవుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.