Will BJP join hands with TDP-JSP in Andhra Pradesh?
రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం,
జనసేన పార్టీల కూటమి తమ అభ్యర్ధుల మొదటి జాబితాను ప్రకటించింది. తెలుగుదేశం, జనసేనలతో
బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇవాళ 99 స్థానాలను
ప్రకటించారు. బీజేపీ నిర్ణయాన్ని బట్టి మిగతా సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది.
తెలుగుదేశం-జనసేన పొత్తులో, పవన్ కళ్యాణ్
పార్టీకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాలు కేటాయించారు. ప్రస్తుతానికి
తెలుగుదేశం 94, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఇంక 76 స్థానాలు
మిగిలున్నాయి. అందులో 19 స్థానాలు జనసేనవి. ఇంక 57 స్థానాలు మిగిలున్నాయి. అలాగే 25
పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేనకు 3 కేటాయించగా ఇంకా 22 స్థానాలున్నాయి. ఒకవేళ
బీజేపీ, తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరిస్తే వారికి అసెంబ్లీలో ఎన్ని, పార్లమెంటులో
ఎన్ని కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది.
మొదటి జాబితాలో దాదాపు ఎలాంటి భిన్నాభిప్రాయాలూ
లేని స్థానాలను ప్రకటించారు. చంద్రబాబునాయుడు కుప్పం నుంచి, నారా లోకేష్ మంగళగిరి
నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి
నుంచి పోటీ చేస్తారు. మిగతా సీట్లలో కూడా పెద్దగా వివాదాలు లేని నియోజకవర్గాలనే
ప్రకటించారు.
అధికార వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశంలోకి
చేరిన వారిలో కొలుసు పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు, కోటంరెడ్డి శ్రీధర్
రెడ్డిలకు సీట్లు దక్కాయి. బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు,
అమరావతి ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన కొలికపూడి శ్రీనివాస్‌కూ టికెట్లు దక్కాయి.
ఇంక తెలుగుదేశంలో కొంతమంది సీనియర్ నాయకులకు బదులు వారి వారసులకు సీట్లు లభించాయి.
విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి, తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి
కుమార్తె దివ్యకు, రాజమండ్రి సిటీలో గత ఎన్నికల్లో గెలిచిన ఆదిరెడ్డి భవాని భర్త
ఆదిరెడ్డి వాసుకు, గతంలో రాజ్యసభ సీటు ఆఖరి నిమిషంలో మిస్సయిన వర్ల రామయ్య కొడుకు
వర్ల కుమారరాజాకు ఈసారి సీట్లు లభించాయి.
జనసేన పార్టీ తనకు కేటాయించిన 24 స్థానాలకు గాను 5
స్థానాల అభ్యర్ధులను మాత్రమే ప్రకటించింది. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి
నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం
నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్
పేర్లను మాత్రం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు
ఏయే స్థానాల నుంచి పోటీ చేస్తారో ఇంకా
వెల్లడించకపోవడం గమనార్హం.