శ్రీశైలేశుడి
దర్శనానికి కాలినడకన వెళ్ళే భక్తులు టికెట్ కొనుగోలు చేయాలంటూ అటవీశాఖ ప్రకటించడంపై
హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్వదినాల్లో ఆలయాలకు వెళ్ళే భక్తులను
ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదు అని మండిపడుతున్నాయిు.
నల్లమల
అటవీమార్గంలో కాలినడకన శ్రీశైలం మార్గంలో వెళ్ళే భక్తులు రూ. 10 టికెట్ కొనుగోలు
చేయాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మహాశివరాత్రి,
ఉగాది పర్వదినాల్లో శ్రీశైలానికి కాలినడకన లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలకు 15రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కాలినడకన శ్రీగిరి చేరుకుంటారు. వీరంతా
నల్లమల అటవీమార్గంలోకి ప్రవేశించిన వెంటనే రూ. 10 టికెట్ కొనుగోలు చేయాల్సిందేనని
అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పల్లెకట్ట వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి
టికెట్లు జారీ చేస్తున్నారు.
ఈ
నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
నడకమార్గంలో
కనీస వసతులు కల్పించకుండా రుసుం చెల్లించమనడం సరికాదంటున్నారు. ప్రభుత్వం జారీ
చేసిన ఉత్తర్వులు చూపాలని కొంతమంది భక్తులు కోరితే అధికారుల నుంచి సరైన సమాధానం రావడం
లేదంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసమే టికెట్ పెట్టినట్లు బదులిస్తున్నారని
భక్తులు చెబుతున్నారు.
కాలినడక భక్తుల నుంచి రూ. 10 టికెట్ వసూలు చేస్తోన్న
అటవీశాఖ అధికారులు, పెద్ద వాహనాలకు రూ. 100, చిన్న వాహనాలకు రూ. 50 వసూలు
చేస్తున్నారు.