వైసీపీని
అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేన కూటమి, అందుకు
తగ్గట్టుగా కట్టుదిట్టమైన ఎన్నికల కార్యాచరణ ప్రకటించింది. వైసీపీకి ఏ మాత్రం
అవకాశం ఇవ్వకుండా ఇరుపార్టీలు ముందుకు సాగుతున్నాయి. టికెట్ల విషయంలో సొంతపార్టీలో
అసంతృప్తి రేగకుండా జాగ్రత్తగా వ్వహరిస్తున్నాయి.
తెలుగుదేశం,
జనసేన కూటమి పోటీ చేసే స్థానాలపై కాసేపట్లో స్పష్టత రానుంది. చంద్రబాబు, పవన్
కళ్యాణ్ సంయుక్తంగా మొదటి విడుత జాబితాను విడుదల చేయనున్నారు.
నేడు మాఘ పౌర్ణమి
కావడంతో ఉదయం 11గంటల40 నిమిషాలకు 65 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను
ప్రకటించనున్నట్లు సమాచారం. తొలి విడత జాబితాలో భాగంగా ప్రకటించే 65 స్థానాల్లో 50
చోట్ల టీడీపీ పోటీ చేయనుండగా 15 సీట్లను జనసేనకు కేటాయించనున్నారు.
ఉండవల్లిలలోని
చంద్రబాబు నివాసంలో జాబితాను ప్రకటించనున్నారు.
ఇప్పటికే జనసేన అధినేత పవన్
కళ్యాణ్ , ఉండవల్లి చేరుకున్నారు. టీడీపీ, జనసేన కూటమి పొత్తు నేపథ్యంలో ఇప్పటికే
100 సీట్లపై కసరత్తు పూర్తి చేసిన ఇరు పక్షాలు, ప్రస్తుతం 65 సీట్లపై స్పష్టత
ఇస్తున్నాయి.
టీడీపీ
అధినేత చంద్రబాబు, కుప్పం నుంచి పోటీ చేస్తుండగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
బీమవరం నుంచి పోటీకి దిగనున్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్, మంగళగిరి నుంచి
రెండోసారి పోటీకి సిద్ధం కాగా, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి
అసెంబ్లీ బరిలో నిలువనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి
టెక్కలి నుంచే శాసనసభకు పోటీ చేయనున్నారు.
వైసీపీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన
నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా రెండు రోజుల్లో టీడీపీలో
చేరనునన్నారు. ఆయనకు నర్సరావుపేట ఎంపీ
టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సుముఖత తెలిపినట్లు పల్నాడులో ప్రచారం జరుగుతోంది.