పశ్చిమ బెంగాల్లో ఇండీ కూటమి పార్టీల మధ్య
సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం రాలేదు. సీట్ల సర్దుబాటుపై తృణమూల్ పార్టీతో చర్చలు
కొనసాగుతున్నాయని కాంగ్రెస్ ప్రకటించిన కొన్ని గంటలకే మమతా బెనర్జీ నేతృత్వంలోని
టీఎంసీ ఒంటరిగా పోటీకి దిగుతున్నట్లు తేల్చి చెప్పింది. పశ్చిమబెంగాల్ లోని 42
లోక్ సభ స్థానాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయంపై
టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కొన్ని వారాల కిందటే స్పష్టమైన సందేశాన్ని
కేడర్ కు అందజేశారని టీఎంసీ నేత, రాజ్యసభ
ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ప్రకటించారు.
అసోంలో పోటీ చేసే స్థానాలతో పాటు మేఘాలయలోని తురా లోక్సభ స్థానం విషయంలో కూడా ఎలాంటి మార్పులు
లేవన్నారు.
పశ్చిమ
బెంగాల్ లో కాంగ్రెస్ ఐదు స్థానాలు కోరగా, తృణమూల్ మూడు ఇచ్చేందుకు సిద్ధపడింది.
దీంతో కూటమిపార్టీల మధ్య పంపకాలు చర్చలు విఫలమయ్యాయి.
తృణమూల్ ఒంటరి పోటీకి సిద్ధం కావడం, కాంగ్రెస్ భాగస్వామిగా
ఉన్న ఇండీ కూటమికి ఎదురుదెబ్బ అంటూ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం దేశం
అంతా పడుతుందని చెబతున్నారు. ఉత్తరప్రదేశ్
లో సమాజ్ వాదీ పార్టీతో సీట్ల పంపకంపై స్పష్టత వచ్చినప్పటికీ బెంగాల్ విషయంలో కథ
అడ్డం తిరిగింది.
దిల్లీ, హర్యానా, గోవా, గుజరాత్లో
పొత్తు విషయమై ఆప్ తో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రావాల్సి ఉంది.